కిలో మామిడికి రూ.3–4 ఇవ్వడంపై ఆగ్రహం
ఇదేం దారుణమంటూ జ్యూస్ ప్యాక్టరీ ఎదుట ఆందోళన
చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నా
గుడిపాల: మామిడి పండ్లకు రూ.8 చొప్పున చెల్లిస్తామని చెప్పిన జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం.. ఆ ధర చెల్లించకుండా మోసగించడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కొత్తపల్లి సమీపంలోని తాసా జ్యూస్ ఫ్యాక్టరీకి మామిడి పండ్లను సరఫరా చేసిన రైతులకు కేజీకి రూ.3, రూ.4 చొప్పున రెండు రోజులుగా చెక్కుల రూపంలో బిల్లులు చెల్లిస్తోంది. దీంతో అవాక్కయిన రైతులు మంగళవారం ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని యాజమాన్యంపై తిరగబడ్డారు.
ఫ్యాక్టరీ యాజమాన్యం తాము ఇంతే ఇస్తామని తేల్చిచెప్పడంతో రైతులంతా 189 కొత్తపల్లె సమీపంలోని చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కిలోకు రూ.8 ఇస్తామని చెప్పడంతో తామంతా మామిడిని ఫ్యాక్టరీకి తోలామని, ఇప్పుడు రూ.3 నుంచి రూ.4 మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు.
రైతులు చెక్కులు తీసుకోకుండా ఫ్యాక్టరీ ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న మామిడి రైతుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆనందనాయుడు, రైతు నేత హరిబాబు అక్కడకు చేరుకున్నారు. గంటకుపైగా రైతులు ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబులెన్స్‌లు మినహా అన్నిటినీ రోడ్డుపై నిలిపివేశారు.
అడ్డుకున్న పోలీసులు
డీఎస్పీ సాయినాథ్, సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్‌ఐలు రామ్మోహన్, అశోక్‌కుమార్ రోడ్డుపై ధర్నాలు చేయకూడదని వెంటనే విరమించాలని రైతులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతుల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రైతులు కలెక్టర్‌ను కలవాలని పట్టుబట్టడంతో ఆర్డీవో శ్రీనివాసులు వారిని కలెక్టరేట్‌కు పంపారు. కలెక్టర్ లేకపోవడంతో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
రూ.8 ఇస్తేనే ధర్నాను విరమిస్తాం
మామిడి పండ్లను తోలి ఇప్పటికే 5 నెలలు గడుస్తోందని, ఫ్యాక్టరీ యాజమాన్యం తమకు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కేజీకి రూ.8 చొప్పున చెల్లిస్తేనే ధర్నా విరమిస్తామని.. ఈ విషయంపై కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ సాయినాథ్, గుడిపాల ఎస్సై రామ్మోహన్, తహశీల్దార్ శ్రీనివాసులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయతి్నంచినా ఫలితం లేకపోయింది.


