తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు
తిరిగి పుదుచ్చేరి వైపు కదులుతున్న వాయుగుండం
నేడు పుదుచ్చేరి–మహాబలిపురానికి మధ్య తీరాన్ని తాకే అవకాశం
సాక్షి, అమరావతి/వాకాడు/చెన్నై: దిత్వా తుపాను వాయుగుండంగా బలహీనపడి కొనసాగుతుండంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం తిరుపతి జిల్లా మల్లంలో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా తడ, చిత్తమూరులో 5, పూలతోటలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలావుండగా బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బుధవారం అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
వాకాడులో 30 మీటర్ల ముందుకొచ్చిన సముద్రం
మంగళవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. సముద్ర తీర ప్రాంత మండలాలైన చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేటలో 52 తీర గ్రామాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు మండలంలో సముద్రం దాదాపు 30 మీటర్లు ముందుకొచ్చింది.
వాకాడు బ్యారేజ్‌లో వరద నీరు అధికంగా చేరడంతో 7 గేట్ల ద్వారా 7 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. దిగువన ఉన్న బాలిరెడ్డిపాళెం–గంగన్నపాళెం మధ్య ఉన్న చప్టా వరద ముంపునకు గురై మునిగిపోయే ప్రమాదం ఉన్నందున అధికారులు గస్తీ కాస్తున్నారు. చిట్టమూరు మండలంలో వరద ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను రెవెన్యూ అధికారులు, పోలీసులు గుర్తించి నిఘా ఉంచారు.
తమిళనాడులో కొనసాగుతున్న వర్షాలు
బలహీనపడ్డ దిత్వా తుపాను దిశను మార్చుకున్నప్పటికీ తమిళనాడులో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం చెన్నై, శివారులలో 30 చోట్ల భారీగా వర్షం పడింది. ఉత్తర చెన్నై పరిధిలోని ఎన్నూరులో 26 సెం.మీ., బ్రాడ్‌వేలో 25 సెం.మీ. వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై వరదలు పోటెత్తాయి. నీటి తొలగింపు పనులను వేగవంతం చేశారు. 40కి పైగా ప్రాంతాలలో ఈదురు గాలుల ధాటికి చెట్లు నేల కొరగడంతో వాటిని తొలగించారు.
ఆంధ్రప్రదేశ్ వైపుగా వాయుగుండం కదలుతుందని భావిస్తే.. అది వచ్చిన దారిలో మళ్లీ పుదుచ్చేరి వైపుగా కదలడం గమనార్హం. బుధవారం పుదుచ్చేరి–మహాబలిపురానికి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో చెన్నై, శివారులలో చిరు జల్లులతో వర్షం పడుతోంది. ఇక అలాగే, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుపత్తూరు, వేలూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.


