చిత్తూరు, విశాఖ, కాకినాడల్లో వెలుగులోకి ఎక్కువ కేసులు
సాక్షి, అమరావతి: నల్లిని పోలిన స్క్రబ్ టైఫస్ కీటకం కుట్టడం ద్వారా సోకే జ్వరాలు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది కాకినాడ, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 380కుపైగా కేసులు వెలుగు చూశాయి. విశాఖ, కాకినాడ జిల్లాల్లో 270కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల స్క్రబ్ టైఫస్ జ్వరంతో విజయనగరంలో ఒక మహిళ మృతిచెందింది. ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రంలో 736 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ నిర్ధారించింది.
ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యశాఖ మంగళవారం ఒక ప్రకటనలో సూచించింది. 2023లో 579 కేసులు, 2024లో 803 కేసులు బయటపడినట్టు వెల్లడించింది. డెంగీ, మలేరియా తరహాలో ఇది కూడా ఓ సాధారణ జ్వరం లాంటిదేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. శరీరంపై చిన్న నల్లమచ్చ కనిపించి, జ్వరం వచ్చినట్లయితే స్క్రబ్ టైఫస్‌గా అనుమానించవచ్చన్నారు. కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కనిపించకపోవచ్చని తెలిపారు.


