ధైర్యంగా ఉండండి.. న్యాయ పోరాటం చేద్దాం: వైఎస్‌ జగన్‌ | New Narikellapalli Ysrcp Leaders Meet Ys Jagan | Sakshi
Sakshi News home page

ధైర్యంగా ఉండండి.. న్యాయ పోరాటం చేద్దాం: వైఎస్‌ జగన్‌

Feb 11 2026 7:16 PM | Updated on Feb 11 2026 7:26 PM

New Narikellapalli Ysrcp Leaders Meet Ys Jagan

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లి (కేఎన్‌ పల్లి) వైఎస్సార్‌సీపీ స్ధానిక నాయకులు కలిశారు. టీడీపీ మూకలు బరితెగించి అర్ధరాత్రి తమ ఇళ్ళపై దాడి చేశారని, తలుపులు బద్దలు కొట్టి ధ్వంసం చేసి బంగారం, నగదు దోచుకున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

చుండూరు మండలం కొత్తనారికేళ్ళపల్లిలో వైఎస్సార్‌సీపీ బీసీ నేత, సర్పంచ్‌ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్‌ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడిచేశాడని.. వైఎస్‌ జగన్‌కు వేమూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ వరికూటి అశోక్‌ బాబు వివరించారు. కేఎన్‌పల్లిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను టార్గెట్‌గా చేసుకుని బాలకోటిరెడ్డి తరుచూ మారణాయుధాలతో మూకుమ్మడి దాడులు చేస్తున్నాడని, గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌ ఉన్నా తమను కాపాడడం లేదంటూ వైఎస్‌ జగన్‌ వద్ద కేఎన్ పల్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై బాపట్ల కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళినా తమ కుటుంబాలకు, ప్రాణాలకు రక్షణ కరువైందని, ప్రాణభయంతో కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నామన్న బాధిత కుటుంబాలు. టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం లేక, ఆత్మహత్యకు అనుమతివ్వాలని కలెక్టర్‌ కార్యాలయంలో కోరిన విషయాన్ని వైఎస్‌ జగన్‌ దృష్టికి నాయకులు తీసుకొచ్చారు. 

వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ ఎవరూ భయపడొద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చిన వైఎస్‌ జగన్‌.. టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందామని, పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని వెల్లడించారు. వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును వైఎస్‌ జగన్‌ తీవ్రంగా తప్పుబట్టారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో గాదె శివరామిరెడ్డి (మాజీ జెడ్పీటీసీ), రఘురామిరెడ్డి (చుండూరు మండల పార్టీ అధ్యక్షుడు), అంగిరేకుల నాగేశ్వరరావు, శివమ్మ, విష్ణు, ఊరుబండి కోటేశ్వరరావు, బాలాజీ నాయక్‌, స్వప్న, అంగిరేకుల తిరుపతమ్మ, శ్రీను, ఉయ్యూరు రవిశంకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్ సభ్యుడు) ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement