గడప దాటాలంటే చేతిలో కర్ర ఉండాల్సిందే! | Village Lion Gangs Hul Chul Parvathipuram Manyam | Sakshi
Sakshi News home page

గడప దాటాలంటే చేతిలో కర్ర ఉండాల్సిందే!

Dec 3 2025 7:44 AM | Updated on Dec 3 2025 7:44 AM

Village Lion Gangs Hul Chul Parvathipuram Manyam

అవి వీధులు కావు..‘గ్రామ సింహాల’ అడ్డాలు! రోడ్డెక్కితే చాలు..మృత్యువు నాలుగు కాళ్ల రూపంలో వెంటాడుతోంది. పసివాడని లేదు..పండు ముసలి అని చూడవు. కనిపించిన వారిపై కసి తీరా విరుచుకుపడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో వీధి కుక్కలు ‘గ్యాంగు’లుగా ఏర్పడి చేస్తున్న స్వైరవిహారంతో జనం గడప దాటాలంటేనే గజగజ వణికిపోతున్నారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా, ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం మాత్రం వీడలేదు. ఫలితంగా జిల్లాలో ఏటా వేల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలవుతున్నారు.

కుక్కల దాడులు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు చిన్నారులు, పనికి వెళ్తున్న ఓ వ్యక్తిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అలాగే పార్వతీపురం మండలం సంగంవలస గ్రామంలో సోమవారం, మంగళవారం గౌరమ్మ అనే ఇద్దరు మహిళలు కుక్కకాటు బారిన పడ్డారు. ఇటీవల ఈ గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తూ దాడులకు తెగబడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. 

ప్రధానంగా అభంశుభం తెలియని విద్యార్థులు ఆనందంగా బడికి వెళ్లాల్సిన సమయంలో కుక్కకాటుకు గురవుతూ ఆస్పత్రి బాట పడుతున్నారు. గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌ పేట, పార్వతీపురం ప్రధాన రహదారులు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో ఇలా ప్రాంతం ఏదైనా పదుల సంఖ్యలో కుక్కలు తిష్ట వేసి వాహనదారులను, పాదచారులను హడలెత్తిస్తున్నాయి.

పసిబిడ్డ ముఖంపై కోరల గాట్లు
నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మరో హృదయ విదారక ఘటన ఇటీవల పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామంలో చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి టి.యశ్వంత్‌ కుమార్‌ పై కుక్క దాడి చేసి ముఖాన్ని తీవ్రంగా గాయపరిచింది. రక్తమోడుతున్న ఆ పసివాడిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. డోకిశీల ఆస్పత్రి నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా పాలకులు, అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం.

లెక్కలు భయంకరం..అధికారుల తీరు నిర్లక్ష్యం
జిల్లాలో కుక్క కాటు బాధితుల సంఖ్య ఏటా ఆందోళనకరంగా పెరుగుతోంది. గత మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా 12,831 మంది కుక్క కాటుకు గురయ్యారు. కేవలం పార్వతీపురం మండలంలోనే 4,783 కేసులు నమోదు కాగా, సీతానగరంలో 1,856 కేసులు ఉన్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య దీనికి అదనం. అధికారిక రికార్డుల్లో రేబిస్‌ మరణాలు లేవు అని అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా..క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరు. జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఉదంతాలు కంటతడి పెట్టిస్తున్నాయి. 2024 మే నెలలోనే బంటు లక్ష్మి(70), నీరస శంకరరావు(39) మృత్యువాత పడ్డారు. నవంబర్‌లో కందేన పారమ్మ కూడా కుక్కల దాడికి బలైంది. ఇవి అధికారుల కంటికి కనిపించడం లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఆదేశాలు బుట్టదాఖలు..చర్యలు శూన్యం
వీధి కుక్కల బెడద నివారణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సాక్షాతు్‌త్‌ సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ జిల్లాలో మాత్రం ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. స్టెరిలైజేషన్‌ (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు చేపట్టిన దాఖలాలు కానరావడం లేదు. అలాగే కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. యుద్ధప్రాతిపదికన వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

స్థానిక సంస్థలు స్పందిస్తేనే..‘ఏబీసీ’ సాధ్యం!
వీధి కుక్కలను అరికట్టడానికి శాసీ్త్రయ పద్ధతిలో ‘ఏనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌’ (ఏబీసీ–కుటుంబ నియంత్రణ) శస్త్రచికిత్సలు చేయడమే ఏకై క మార్గం. అయితే ఈ ప్రక్రియలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పాత్రే కీలకం. నిబంధనల ప్రకారం ముందుగా స్థానిక సంస్థలు ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను నియమించాలి. ఆయా కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బందితో కుక్కలను పట్టుకుని, మా శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. అలా పట్టుకువచ్చిన శునకాలకు మా పశువైద్యాధికారులు, సిబ్బంది వెంటనే శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. శస్త్రచికిత్స అనంతరం వాటి బాగోగులు చూసి, తిరిగి పట్టుకున్న ప్రాంతాల్లోనే వదిలేయాలి. 
:::డా.మన్మథరావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి, పార్వతీపురం మన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement