పోలియోపై పోరుకు సిద్ధం
● డిసెంబర్ 21న పోలియో చుక్కలు
● డీఎంహెచ్‌ఓ భాస్కర రావు
పార్వతీపురం రూరల్: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. ఈ నెల 21న జరగనున్న పోలియో డ్రైవ్‌పై వైద్యాధికారులకు, పర్యవేక్షకులకు స్థానిక ఎన్జీఓ హోంలో మంగళవారం రీ–ఓరియంటేషన్ శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తు ఆరోగ్యం దృష్ట్యా వ్యాక్సిన్ ఆవశ్యకతపై ఇప్పటి నుంచే ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల జాబితాతో పక్కా మైక్రో ప్లాన్ రూపొందించాలని, హైరిస్క్ ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కోల్డ్ చైన్ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసి, వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా సిబ్బంది కృషి చేయాలని కోరారు. డాక్టర్ జాన్ పవర్ శిక్షణ ఇవ్వగా, కార్యక్రమంలో డీఐఓ డా.విజయ మోహన్ సహ జిల్లా ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.


