పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రదాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. చదురుగుడి వద్దనున్న బాలాలయంలో మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలతో అర్చనలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.
న్యాయమూర్తి మానవతా దృక్పథం
విజయనగరం టౌన్: పాక్షికదృష్టి లోపంతో నడిరోడ్డుపై అగమ్యగోచరంగా ఓ వృద్ధుడు తిరుగుతున్నట్లు తెలుసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మానవతా దృక్పథంతో స్పందించారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కృష్ణప్రసాద్‌ను పంపించి ఆ వృద్ధుడిని ప్రేమసమాజంలో మంగళవారం చేర్పించారు. ఈ సందర్భగా వృద్ధుడి పేరు అప్పన్నగా కృష్ణప్రసాద్ తెలుసుకుని ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి, బాగోగులను చూసుకోవాలని, ఎటువంటి సహాయ, సహకారాలు కావాల్సిన జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.
చట్టప్రకారమే చర్యలు
● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: సాలూరులో మంత్రి అనధికార పీఏ, ఓ ఒంటరి మహిళ పరస్పరం చేసుకున్న ఫిర్యాదులపై చట్టప్రకారమే నడుచుకుంటున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వీమాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగం పేరుతో మోసం చేశారని మహిళ, తమపై అసత్య ప్రచారాలు చేస్తూ కుట్ర పన్నుతున్నారని పీఏ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సాలూరులో రెండు కేసులు నమోదు చేశామన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది అవాస్తవమని ఎస్పీ కొట్టిపారేశారు. ‘కేసులో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు సాంకేతిక ఆధారాలను, వాట్సాప్ చాటింగ్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, ఆ నివేదిక ఆధారంగా, సమగ్ర విచారణ జరిపి తప్పు ఎవరిదైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తేల్చిచెప్పారు.
సామాజిక రుగ్మతలపై..
గురజాడ ‘అక్షర’ కొరడా
● చరిత్రను సాహిత్యంగా మలిచిన వైతాళికుడు
● ప్రముఖ సాహితీవేత్త పొదిలాపు శ్రీనివాస్
పార్వతీపురం రూరల్: గురజాడ లేని సాహిత్య జాడ శూన్యమని, తరాలు మారినా ఆయన అక్షరం తరగని గని అని ప్రముఖ సాహితీవేత్త పొదిలాపు శ్రీనివాస్ అభివర్ణించారు. పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవం మంగళవారంతో ఎనిమిదో రోజుకు చేరుకుంది. వంగపండు–భూషణం– గణేష్ పాత్రో సాహిత్య వేదికపై జరిగిన సభకు పిల్ల తిరుపతిరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన పొదిలాపు ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. పురాతన అహంకారం మొదలు..నేటి కార్పొరేట్ అధికారం వరకు సాగుతున్న దోపిడీని తన సాహిత్యంతో ఎండగట్టిన ధీశాలి గురజాడ అని కొనియాడారు. ‘కన్యాశుల్కం’ ద్వారా మహిళా లోకానికి వెలుగులద్ది, అణగారిన వర్గాల హక్కుల కోసం అక్షరాయుధాన్ని ప్రయోగించిన సంఘ సంస్కర్త అని ప్రస్తుతించారు. పేదల బతుకులను ఛిద్రం చేసే కుట్రలను తన రచనల ద్వారా ప్రతిఘటించిన తీరు అమోఘమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు రచించిన ‘శతర’ పుస్తకాన్ని సాహితీవేత్త అల్తి మోహన్‌న్ సమీక్షించారు. గురజాడ ఆశయ సాధనే లక్ష్యంగా సాగిన ఈ వేడుకలో కామాక్షి నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా అలరించింది.
పుష్పాలంకరణలో పైడితల్లి
పుష్పాలంకరణలో పైడితల్లి
పుష్పాలంకరణలో పైడితల్లి


