పారా జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం
విజయనగరం: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారంతో మంగళవారం స్థానిక విజ్జి స్టేడియంలో దివ్యాంగ క్రీడాకారుల జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహ భరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఎ.రామారావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వర రావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ లతో కలిసి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, వైకల్యాన్ని జయించే శక్తి క్రీడలకు ఉందన్నారు. ప్రభుత్వాలు కూడా పారా క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా క్రీడల్లో రాణించాలని సూచించారు. రన్నింగ్, షాట్‌పుట్, డిస్క్‌త్రో, జావెలిన్‌త్రో, లాంగ్‌జంప్, హై జంప్ అంశాల్లో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 150 మంది వరకు దివ్యాంగ క్రీడాకారులు పోటీలకు హజరుకాగా..జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమలో సమగ్ర శిక్ష జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.సూర్యారావు, సహాయ కో–ఆర్డినేటర్ ఎం.భారతి, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


