ఆత్మవిశ్వాసమే ఆలంబనగా..
● నర్సిపురంలో పారా ఒలింపిక్స్ క్రీడలు
● విజేతలకు బహుమతులు
పార్వతీపురం రూరల్: శారీరక వైకల్యాన్ని జయిస్తూ మానసిక స్థైర్యంతో దివ్యాంగ విద్యార్థులు క్రీడా మైదానంలో కదం తొక్కారు. మంగళవారం పార్వతీపురం మండలంలోని నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా పారా ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా సాగాయి. 15 మండలాల నుంచి వచ్చిన 85మంది విద్యార్థులు పతాకాల వేటలో పోటాపోటీగా తలపడ్డారు. డీఈఓ బి.రాజ్‌కుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ తేజేశ్వరరావు డీఎల్‌ఈసీ భానుమూర్తి ఈ పోటీలను పర్యవేక్షించారు.
రాష్ట్రస్థాయికి ఎంపికై న ఆణిముత్యాలు
పోటీల్లో సత్తాచాటి రాష్ట్రస్థాయికి అర్హత సాధించిన వారిలో 400మీటర్ల పరుగుకు సంబంధించి కె.ప్రమీల, జూనియర్ విభాగంలో సీహెచ్ జాను, ప్రధమ స్థానాల్లో నిలవగా జి. మణి, రాంనరేష్ ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు. లాంగ్ జంప్ విభాగంలో ఎస్.శివ, పి.రామచంద్ర (అండర్ జూనియర్స్) వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో నిలిచారు. జావెలెన్ త్రోకు సంబంధించి జూనియర్ విభాగంలో వెంకటసాయి, మనీషా స్వర్ణాలు సాధించారు. ఈ మేరకు విజేతలతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా పతాకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.


