జాతీయ జంబోరీలో జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందానికి
విజయనగరం అర్బన్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నవంబర్ 23 నుంచి 29వ తేదీ వరకు జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జంబోరీలో జిల్లా బృందం అద్భుతంగా రాణించింది. దేశవ్యాప్తంగా 35 వేల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 455 మంది, వారిలో విజయనగరం జిల్లా నుంచి 30 మంది పాల్గొన్నారు. అందులో కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచే 27 మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం. రాష్ట్రబృందం మొత్తం 9 అవార్డులు సాధించగా జిల్లా కంటిన్జెంట్ టీమ్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది. గెలుచుకున్న అవార్డులలో బ్యాండ్–ఎ గ్రేడ్, మార్చ్‌పాస్ట్–ఎ గ్రేడ్, క్యాంప్‌క్రాఫ్ట్ ఎ గ్రేడ్, క్యాంప్ ఫైర్ –ఎ గ్రేడ్, స్టేట్ గేట్ –బి గ్రేడ్, పయనీరింగ్–బి గ్రేడ్, రంగోలి–సి గ్రేడ్ విభాగాలు ఉన్నాయి. జంబోరి ముగింపు కార్యమానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్ధులను ఆశీర్వదించారు. జిల్లాకు చేరుకున్న విజేతల బృందానికి జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు మంగళవారం ఘనంగా స్వాగతం పలికారు. గెలుచుకున్న షీల్డ్‌లు, సర్టిఫికెట్లను విజేతలకు, గైడ్ టీచర్లకు అందజేశారు. బృంద ప్రతినిధులు ఏఎస్‌ఓసీ కె.దుర్గానాగేశ్వరరావు, డీటీసీ ఎ.కనకలక్ష్మి, కె.సూరిబాబులను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ జిల్లా కార్యదర్శి వాక చిన్నంనాయుడు, కమిషనర్ ఈ.విజయకుమార్, సీఈఓ సన్యాసిరాజు, డైట్ వైస్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు, నాగరాజు, శర్మ తదితరులు పాల్గొన్నారు.


