నిశీధి నిశ్శబ్దాన్ని చీల్చుతూ గంగమ్మ పారే శబ్దం. అప్పుడప్పుడూ అటుగా వెళ్ళే వాహనాల గర్జన. ఆ పరిస్థితుల నడుమ రోమాలు నిక్కబొడుచుకునే ఘటన దృశ్యం కనిపించింది. ఓ తల్లి కర్కశంగా పేగుతెంచుకున్న పాశాన్ని వదిలేసి వెళ్లిపోతే.. వీధి కుక్కలు సంరక్షకులుగా మారి రాత్రంతా కాపలా కాస్తూ ఉండిపోయాయి.
పశ్చిమ బెంగాల్ నదియా జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నబద్వీప్ ఏరియా స్వరూప్‌నగర్ రైల్వే కాలనీ టాయిలెట్ బయట గుర్తు తెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలేసి వెళ్లిపోయారు. అయితే స్థానికంగా సంచరించే వీధి కుక్కలు రాత్రంతా ఆ చంటి బిడ్డ చుట్టూ చేరి కాపలాగా ఉన్నాయి. తెల్లవారగానే పసికందు ఏడుపుతో ఆ కాలనీ ఉలిక్కి పడింది. అటుపై అక్కడి దృశ్యం చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.
ఓ మహిళ ధైర్యం చేసి కుక్కలను పక్కకు తరిమి శిశువును దుప్పటిలో చుట్టి ఆస్పత్రికి తరలించింది. బిడ్డ పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి పరిస్థితిని బట్టి ఆమె పుట్టి కొన్ని గంటలకే అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రక్తపు మరకలతో ఉన్న పసిగుడ్డుపై కనీసం ఒంటిపై దుప్పటి కూడా కప్పకుండా ఆ చలిలో అలానే వదిలేసి వెళ్లిపోయారు దుర్మార్గులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రాత్రిళ్లు అటుగా వెళ్లే బైకర్లను ఆ కుక్కలు తరుముతున్నాయంటూ మొన్నీమధ్యే స్థానికులు మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశారు. అలాంటిది ఇప్పుడు ఆ కాలనీలో చంటిబిడ్డను కాపాడి సూపర్‌హీరోలు అయిపోయాయి. పిల్లలు కొందరు కూడా వాటికి బిస్కెట్లు వేస్తూ ఫొటోలకు ఫోజులు ఇస్తుండడం గమనార్హం. "మానవత్వం" అనే పదం పుట్టింది మనిషి నుంచే కావొచ్చు. కానీ.. జీవం ఉన్న ప్రతి ప్రాణిలో కనిపించవచ్చు. అందుకు ఈ ఘటనే ఉదాహరణ కాదంటారా?..
ఇలాంటి ఘటనే..
1996లో కోల్‌కతా సమీపంలో ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త గుట్టలో వదిలేశారు. అయితే ఆ బిడ్డకు మూడు వీధి కుక్కలు కాపలాగా ఉన్నాయి. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డ సంరక్షణా కేంద్రానికి చేరింది.


