ఎయిరిండియా విమానయాన సంస్థ తన ప్రయాణికులకు చుక్కలు చూపించింది. పలు ఎయిర్‌పోర్టులలో పడిగాపులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితికి వివరణ ఇస్తూ ఎయిర్‌లైన్స్ తర్వాత ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చింది.
మంగళవారం సాయంత్రం తర్వాత పలు ఎయిర్‌పోర్టులలో ఎయిరిండియా ప్యాసింజర్ల చెక్ ఇన్‌ను అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో క్యూ లైన్లలో ప్రయాణికులు చాలాసేపు ఎదురు చూశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇది చోటు చేసుకుందని ఆ తర్వాత ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. థర్డ్ పార్టీ సిస్టమ్‌లో సమస్య కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని.. ఆ సమస్యను పరిష్కరించామని.. ఇప్పుడంతా సర్వసాధారణ పరిస్థితి నెలకొందని.. రాకపోకలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది.
#Update
The third-party system has been fully restored, and check-in at all airports is functioning normally. All our flights are operating as per schedule.
We thank our passengers for their understanding.— Air India (@airindia) December 2, 2025
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు ఆలస్యం కాగా.. మరికొన్ని పూర్తిగా రద్దయ్యాయి. ఇదిలా ఉంటే.. కిందటి నెలలోనూ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో టెక్నికల్ ఇష్యూ తలెత్తి సుమారు 800 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దానికి కొన్ని రోజులముందు జీపీఎస్ స్పూఫింగ్ (GPS spoofing) జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ స్పూఫింగ్ నిజమేనని, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) మార్చేందుకు యత్నాలు జరిగినట్టు కేంద్రం ధ్రువీకరించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. సోమవారం రాజ్యసభలో పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు.
నేవిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ అంటారు. నిజమైన శాటిలైట్ సిగ్నల్స్‌ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్‌ను తప్పుదోవ పట్టిస్తాయి. ఫలితంగా.. ప్రస్తుతమున్న ప్రదేశం, సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయి. పౌర విమానాలే లక్ష్యంగా అంతర్జాతీయ రూట్‌లలో ఈ తరహాలో జరిగిన సైబర్ దాడులు తరచూ వెలుగుచూస్తున్నాయి. దేశంలో నవంబర్ 2023- ఫిబ్రవరి 2025 మధ్యకాలంలో 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు నమోదైనట్లు అంచనా.


