న్యూఢిల్లీ: గత జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన కేసులో కేంద్ర ప్రభుత్వానికి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీసీసీఏ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ కోరుతూ ఎయిర్ ఇండియా పైలట్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందిస్తూ, సుప్రీం కోర్టు ఈ నోటీసు జారీ చేసింది. పైలట్ తండ్రి.. ఈ ఘటనకు సరైన కారణాన్ని గుర్తించేందుకు, జవాబుదారీతనం నిర్ధారించేందుకు స్వతంత్ర దర్యాప్తును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చి , జె సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం.. విమాన ప్రమాదంపై తప్పుడు నివేదికలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషాద సంఘటనకు పైలట్‌ను బాధ్యుడిని చేస్తూ, నిందించకూడదని ధర్మాసనం పేర్కొంది. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి బాధ్యుడంటూ పైలట్‌ను నిందించకూడదు. ఇది ఒక విషాద ఘటన. ప్రాథమిక నివేదికలో పైలట్ వైపు నుండి ఎటువంటి తప్పు లేదని తేలింది. ఇటువంటి తప్పుడు నివేదికలు రూపొందించకూడదు. ఇటువంటి ఘటనలపై పరిశోధించేందుకు నిర్థిష్ట నిబంధనలున్నాయని జస్టిస్ బాగ్చి అన్నారు.
దివంగత పైలట్ తండ్రి, పిటిషనర్ వ్యక్తం చేసిన బాధను, న్యాయమైన దర్యాప్తు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ మాట్లాడుతూ, ‘నియమం 11 అనేది ప్రమాదాలకు సంబంధించినది. నిబంధన తొమ్మిది ప్రకారం ప్రాథమిక దర్యాప్తు మాత్రమే నిర్వహించారు. మేము స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నాం. ఈ విమాన ప్రమాదంపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిగేలా చూడాలని’ కోర్టును కోరారు.
2025, జూన్ 12న మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు సహా మొత్తం 265 మంది మృతి చెందారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: వీధి కుక్కల కేసు: ‘సుప్రీం’ కీలక ఆదేశాలు


