న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా (AI887) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున 3.20 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, విమానం కుడి వైపు ఇంజిన్ (ఇంజిన్ నంబర్ 2)లో ఆయిల్ ప్రెజర్ ఒక్కసారిగా సున్నాకి పడిపోయింది. ఈ అత్యవసర పరిస్థితిని గమనించిన పైలట్లు అప్రమత్తమై, వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి, సురక్షితంగా ల్యాండ్ చేయడంతో 100 మందికి పైగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
సాధారణంగా విమాన ఇంజిన్ భాగాలు వేడెక్కకుండా, సజావుగా పనిచేయడానికి ఇంజిన్ ఆయిల్ ఎంతో కీలకం. ఆయిల్ ప్రెజర్ సున్నాకి పడిపోవడం అనేది విమానయాన రంగంలో అత్యంత ప్రమాదకరమైన ‘టెక్నికల్ ఫెయిల్యూర్’గా పరిగణిస్తారు. దీనివల్ల ఇంజిన్ మంటలు అంటుకోవడం లేదా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే, బోయింగ్ 777-337 ER విమాన సిబ్బంది సరైన సమయంలో స్పందించి ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ పాటించడంతో పెను ముప్పు తప్పింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి, ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
గత కొద్ది రోజుల్లో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం (డిసెంబర్ 18న) గన్నవరం విమానాశ్రయంలో విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కూడా ఇలాంటి ఇంజిన్ సమస్యే తలెత్తింది. ఆ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు ఉన్నారు. అయితే టేకాఫ్‌కు ముందే ఈ లోపాన్ని గుర్తించి,విమానాన్ని రద్దు చేయడంతో ప్రమాదం తప్పింది.
వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు విమానాల నిర్వహణ, భద్రతా తనిఖీలపై ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, పర్యాటక సీజన్ కావడంతో విమానయాన సంస్థలు తమ విమానాల కండిషన్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఢిల్లీలో నిలిచిపోయిన విమానానికి సమగ్ర సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నామని, పూర్తి క్లియరెన్స్ వచ్చాకే విమానాన్ని తిరిగి సర్వీసులోకి తెస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ఆపరేషన్ సిందూర్‌పై మునీర్ సంచలన వ్యాఖ్యలు


