ఆన్‌లైన్‌లో బీటెక్ బీ కేటగిరీ సీట్లు.. సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరిన ప్రభుత్వం
యాజమాన్య కోటా సీట్లలో చేరే విద్యార్థులవి లక్ష ర్యాంకుపైనే
ఈ విధానం నాణ్యతను దెబ్బతీస్తోందంటున్న వీసీలు
మెరిట్ ప్రాతిపదికగా సీట్లు ఇవ్వాలనేది వర్సిటీల అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీ విధానంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మెడికల్ సీట్ల తరహాలో ఆన్‌లైన్‌లో సీట్లు కేటాయించాలని భావిస్తోంది. సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరింది. కొన్నేళ్లుగా సీట్ల భర్తీ, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై సమగ్ర డేటా ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో 30 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు.
ఈ ప్రవేశాలపై కొన్నేళ్లుగా విమర్శలు వస్తున్నాయి. ఈ సీట్లను ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేయాలని ఉన్నత విద్యామండలి గత ఏడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సాధారణ ఫీజు కన్నా రెట్టింపుతో బీ కేటగిరీ, మూడు రెట్ల ఎక్కువతో సీ (ఎన్‌ఆర్‌ఐ కోటా) కేటగిరీ భర్తీ చేయాలని పేర్కొంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి గత ఏడాది ఎలాంటి స్పందన కనిపించలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
లోపిస్తున్న నాణ్యత
యాజమాన్య కోటా కింద దాదాపు 31 వేల సీట్లు ఉంటాయి. ఇందులో 25 వేల సీట్లు భర్తీ అవుతున్నాయి. 80 శాతం సీట్లు కంప్యూటర్ సైన్స్, అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లోనే నిండుతున్నాయి. వాస్తవానికి బీ కేటగిరీ సీట్లను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలి. కానీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ఇష్టారాజ్యంగా సీట్లు అమ్ముకుంటున్నాయనే విమర్శలున్నాయి. మెరిట్ ప్రకారం సీటివ్వలేదని ఉన్నత విద్యామండలికి ఏటా 200 వరకూ ఫిర్యాదులు వస్తున్నాయి. కాలేజీలకు నోటీసులిచ్చి కౌన్సిల్ చేతులు దులుపుకుంటోంది. ఆన్‌లైన్ విధానం లేకపోవడం వల్ల విద్యార్థి దరఖాస్తు చేసినట్టు ఆధారాలుండటం లేదు. ఆధారాలు లేకుండా తామేమీ చేయలేమని అధికారులు అంటున్నారు.
దీంతో ఒక్కో సీటును రూ.12 నుంచి రూ. 20 లక్షల వరకూ ప్రైవేటు కాలేజీలు అమ్ముకుంటున్నాయి. ఈ వ్యాపారం దాదాపు రూ. వెయ్యి కోట్లకుపైగానే ఉంటోంది. ఇందులో అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీ పెద్దలకు ముడుపుల రూపంలో వెళ్తున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులకు వాటాలు అందుతున్నాయి. దీంతో ఆన్‌లైన్ విధానంపై ఇంతకాలం సీరియస్‌గా దృష్టి పెట్టలేదు. ఇటీవల వీసీల సమావేశంలో బీ కేటగిరీ సీట్ల భర్తీపై అనేక అంశాలు తెరమీదకు వచ్చాయి. లక్షకుపైగా ఏప్‌సెట్ ర్యాంక్ వచ్చిన వారికీ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు వస్తున్నాయి. దీనివల్ల నాణ్యత ప్రమాణాలు పడిపోతున్నాయని వీసీలు తెలిపారు.
రింగ్ అవుతున్న యాజమాన్యాలు
ఆన్‌లైన్ విధానంలో సీట్ల భర్తీని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతీసారి అడ్డుకుంటున్నాయి. యాజమాన్యాలన్నీ ఏకమై ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల నుంచి సీట్ల కోసం సిఫార్సులు వస్తున్నాయి. దీన్ని అడ్డుపెట్టుకొని యాజమాన్యాలు ఇష్టానుసారం సీట్లు అమ్ముకుంటున్నాయి. ప్రైవేట్ కాలేజీల వ్యవహారంపై 2017లో ప్రభుత్వం టాస్‌్కఫోర్స్ వేసింది. తాజాగా 2025లోనూ తనిఖీల కమిటీని వేశారు. కొన్ని కాలేజీలను తనిఖీ చేసిన అధికారులు హడావిడి చేయడం మినహా సాధించిందేమీ లేదు.
ఇప్పటి వరకూ తనిఖీల్లో తేలిందేంటి? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. కేవలం ఫీజుల పెంపును అడ్డుకునేందుకే ఈ కమిటీ వేసినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ కాలేజీలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయని కమిటీ నిగ్గు తేల్చినా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల కట్టడిపై కసరత్తు ఎంత వరకూ ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.


