చికెన్‌ ముక్క చిక్కుల్లో ఎయిర్‌ ఇండియా  | Air India flyer non-veg meal ordeal video goes viral | Sakshi
Sakshi News home page

చికెన్‌ ముక్క చిక్కుల్లో ఎయిర్‌ ఇండియా

Jan 23 2026 6:30 AM | Updated on Jan 23 2026 6:30 AM

Air India flyer non-veg meal ordeal video goes viral

చికెన్‌ అడిగితే వార్నింగ్‌ లెటర్‌ ఇచ్చారు 

విమాన ప్రయాణికుడికి చుక్కలు 

ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కారా? అయితే మీ ఆకలిని అణచుకోండి.. లేదంటే ’కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌’ హెచ్చరిక లేఖ అందుకునేందుకు సిద్ధంగా ఉండండి.. బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీ వస్తున్న అభిషేక్‌ చౌదరి అనే ప్రయాణికుడికి ఎయిర్‌ ఇండియా సిబ్బంది చుక్కలు చూపించారు. ముందుగా బుక్‌ చేసుకున్న మీల్‌ అడిగినందుకు తనను వేధించారంటూ ఆయన సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన యూట్యూబర్‌ ఫ్రెండ్‌ ఆకాష్‌ గుప్తాతో కలిసి దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశాడు. 

నాన్‌వెజ్‌ భోజనం బుక్‌ చేసినా.. 
జనవరి 19న జరిగిన ఈ ప్రయాణంలో అసలు రచ్చ అంతా నాన్‌ వెజ్‌ భోజనం దగ్గర మొదలైంది. అభిషేక్‌ తన తమ్ముడి కోసం ముందుగానే నాన్‌–వెజ్‌ భోజనం బుక్‌ చేసుకున్నాడు. కానీ ఆహారం అందించే సమయానికి.. అది అయిపోయిందని సిబ్బంది చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే, కనీస మర్యాద లేకుండా ‘నీ టికెట్‌ చూపించు’అంటూ ఎయిర్‌ హోస్టెస్‌ మొరటుగా ప్రవర్తించిందని అభిషేక్‌ ఆరోపించాడు. పక్కనే ఉన్న ఓ ఫ్రెంచ్‌ ప్రయాణికుడికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ‘క్షమాపణ చెప్పాల్సింది పోయి, చాలా దురుసుగా మాట్లాడారు’.. అని ఆ విదేశీ ప్రయాణికుడు కూడా వీడియోలో వాపోయాడు. 

బెదిరింపులు.. ఆంక్షలు 
అభిషేక్‌ ఈ విషయాన్ని సీనియర్‌ క్రూ మెంబర్‌ దృష్టికి తీసుకెళ్తే, ఆమె ఇంకా సీరియస్‌గా ‘నువ్వు నోరు మూసుకో’అని గద్దించిందట. విచిత్రం ఏంటంటే, అభిషేక్‌ ఈ గొడవను వీడియో తీస్తున్నాడని తెలియగానే, ఫ్లైట్‌లో లైట్లు డిమ్‌ చేసేశారట. విమానం ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యాక అభిషేక్‌ దిగకుండా గ్రౌండ్‌ స్టాఫ్‌ ఆపేశారు. అతని ఫోన్‌ లాక్కుని చెక్‌ చేశారు. ‘జరిగిందేదీ సోషల్‌ మీడియాలో పెట్టను’.. అని బలవంతంగా రాయించుకున్నారట. పైగా అతను తాగి ఉన్నా డని తప్పుడు ఆరోపణలు చేశారట. చివరగా, పైలట్‌ సంతకంతో కూడిన ఒక ‘కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ వార్నింగ్‌ లెటర్‌’కూడా చేతిలో పెట్టారు. 

మొక్కుబడి స్పందన 
ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనిపై పూర్తి విచారణ జరుపుతున్నామని, తప్పు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement