breaking news
Non-vegetarian meal
-
చికెన్ ముక్క చిక్కుల్లో ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా విమానం ఎక్కారా? అయితే మీ ఆకలిని అణచుకోండి.. లేదంటే ’కోడ్ ఆఫ్ కాండక్ట్’ హెచ్చరిక లేఖ అందుకునేందుకు సిద్ధంగా ఉండండి.. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వస్తున్న అభిషేక్ చౌదరి అనే ప్రయాణికుడికి ఎయిర్ ఇండియా సిబ్బంది చుక్కలు చూపించారు. ముందుగా బుక్ చేసుకున్న మీల్ అడిగినందుకు తనను వేధించారంటూ ఆయన సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన యూట్యూబర్ ఫ్రెండ్ ఆకాష్ గుప్తాతో కలిసి దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. నాన్‌వెజ్ భోజనం బుక్ చేసినా.. జనవరి 19న జరిగిన ఈ ప్రయాణంలో అసలు రచ్చ అంతా నాన్ వెజ్ భోజనం దగ్గర మొదలైంది. అభిషేక్ తన తమ్ముడి కోసం ముందుగానే నాన్–వెజ్ భోజనం బుక్ చేసుకున్నాడు. కానీ ఆహారం అందించే సమయానికి.. అది అయిపోయిందని సిబ్బంది చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే, కనీస మర్యాద లేకుండా ‘నీ టికెట్ చూపించు’అంటూ ఎయిర్ హోస్టెస్ మొరటుగా ప్రవర్తించిందని అభిషేక్ ఆరోపించాడు. పక్కనే ఉన్న ఓ ఫ్రెంచ్ ప్రయాణికుడికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ‘క్షమాపణ చెప్పాల్సింది పోయి, చాలా దురుసుగా మాట్లాడారు’.. అని ఆ విదేశీ ప్రయాణికుడు కూడా వీడియోలో వాపోయాడు. బెదిరింపులు.. ఆంక్షలు అభిషేక్ ఈ విషయాన్ని సీనియర్ క్రూ మెంబర్ దృష్టికి తీసుకెళ్తే, ఆమె ఇంకా సీరియస్‌గా ‘నువ్వు నోరు మూసుకో’అని గద్దించిందట. విచిత్రం ఏంటంటే, అభిషేక్ ఈ గొడవను వీడియో తీస్తున్నాడని తెలియగానే, ఫ్లైట్‌లో లైట్లు డిమ్ చేసేశారట. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక అభిషేక్ దిగకుండా గ్రౌండ్ స్టాఫ్ ఆపేశారు. అతని ఫోన్ లాక్కుని చెక్ చేశారు. ‘జరిగిందేదీ సోషల్ మీడియాలో పెట్టను’.. అని బలవంతంగా రాయించుకున్నారట. పైగా అతను తాగి ఉన్నా డని తప్పుడు ఆరోపణలు చేశారట. చివరగా, పైలట్ సంతకంతో కూడిన ఒక ‘కోడ్ ఆఫ్ కండక్ట్ వార్నింగ్ లెటర్’కూడా చేతిలో పెట్టారు. మొక్కుబడి స్పందన ఈ వీడియో వైరల్ అవ్వడంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనిపై పూర్తి విచారణ జరుపుతున్నామని, తప్పు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేవలం వెజ్ మీల్స్‌తో రూ.10 కోట్లు ఆదా
న్యూఢిల్లీ : తీవ్ర నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియా ఎప్పడికప్పుడూ తమ ఖర్చులను తగ్గించుకోవడానికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నాన్-వెజ్ మీల్స్ ఎక్కువగా వేస్ట్ అవుతుందని, ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఇటీవలే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎయిరిండియాకు వార్షికంగా 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం పార్లమెంట్‌కు చెప్పింది. వారికి కేవలం శాకాహార భోజనం సరఫరా చేయడంతో ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. నాన్-వెజిటేరియన్ మీల్స్ కేవలం ఎయిరిండియా దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ వారికే రద్దు చేశామని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మెనూలో, భోజన షెడ్యూల్లో పలు మార్పులు చేశామని, ప్రస్తుత ట్రెండ్స్‌కు అనుగుణంగా అనుబంధ వస్తువులను అందించడం వంటి చర్యలతో ఈ విమానయాన సంస్థకు ఖర్చులు తగ్గి వార్షికంగా ఎయిరిండియాకు రూ.20 కోట్ల మేర ఆదా అవుతాయని ఆయన తెలిపారు.


