విమాన టికెట్లకు రెక్కలు..! | Airline ticket prices jump | Sakshi
Sakshi News home page

విమాన టికెట్లకు రెక్కలు..!

Mar 11 2026 1:38 AM | Updated on Mar 11 2026 1:38 AM

Airline ticket prices jump

ఎయిరిండియా ఇంధన సర్‌చార్జీ..

దేశీ ప్రయాణాలపై రూ. 399 వడ్డింపు 

విదేశీ ప్రయాణాలపైనా చార్జీల వసూలు 

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 12 నుంచి ఇంధన సర్‌చార్జీ విధింపునకు తెరతీశాయి. దేశీ విమాన ప్రయాణికులపై ఒక్కో టికెట్‌కు రూ.399 చొప్పున ఫ్యూయెల్‌ సర్‌చార్జీని వసూలు చేసేందుకు నిర్ణయించాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రయాణ  టికెట్‌ చార్జీలను సైతం పెంచేందుకు నిర్ణయించాయి. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ పరిస్థితుల కారణంగా జెట్‌ ఫ్యూయెల్‌ ధరలు పెరగడంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే దశలవారీగా వీటిని అమలు చేయనున్నాయి.

తొలి దశలో ఈ నెల 12 నుంచి దేశీ విమాన టికెట్లపై రూ. 399 వసూలు చేయనున్నాయి. సార్క్‌ దేశాల విమాన సర్వీసులకు సైతం వీటిని వర్తింపచేయనున్నాయి. ఇక పశ్చిమాసియా విమాన సర్వీసులపై ఇంధన సర్‌చార్జీని ఒక్కో టికెట్‌కు 10 డాలర్లు చొప్పున విధించనుంది. ఆఫ్రికా ప్రయాణాలపై 30 నుంచి 90 డాలర్ల వరకూ ఈ చార్జీల మోత మోగనుంది. ఆగ్నేయ ఆసియా దేశ సర్వీసులపై 20–60 డాలర్ల మధ్య ఈ అదనపు చార్జీ వసూలు చేయనుంది. సింగపూర్‌ ప్రయాణాలుసహా ఈ మార్పులన్నీ మార్చి 12 నుంచి అమల్లోకిరానున్నాయి. ప్రస్తుతం సింగపూర్‌ విమాన సర్వీసులపై ఇంధన సర్‌చార్జీ లేకపోవడం గమనార్హం! 

Advertisement
 
Advertisement
Advertisement