మధ్య తరగతి వారికి విమాన ప్రయాణం ఒక తీరని కల. ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆ వైపుగా ఆలోచన కూడా చేయరు. కానీ .. ఓ కుమారుడు తల్లిదండ్రుల కోసం ఆ కలను నిజం చేస్తే..? ఆ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ అందరి మనసుల్ని గెలుచుకుంటోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక యువకుడు, ఇప్పుడు తన తల్లిదండ్రులకు ఆ మేఘాలపై విహరించే ఆనందాన్ని అందించాడు.
తన తల్లిదండ్రులని విమానాశ్రయం వద్దకి తీసుకువెళ్లగానే భారీ విమానాశ్రయ భవనం, అక్కడి వెలుగులను చూసి వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఉత్సాహంతో΄ాటు, విమానం ఎక్కే ముందు కొంచెం కంగారుగా కనిపించినా.. తమ కుమారుని చేయి పట్టుకుని విమానంలోకి ప్రవేశించినపుడు వారి ఆందోళన అంతా పోయి ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. ఆ క్షణం ఎంతో విలువైనది. తన తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని చూసి, ఆ కుమారుడి ముఖంలో ఎంతో తృప్తి, గర్వం. దీనికి సంబంధించిన వీడియోని చూసిన నెటిజనులు తల్లిదండ్రుల కల నెరవేరిన సంతోష సమయం అనీ... కొడుకు కళ్లల్లో ఆనందం వెల కట్టలేనిది అనీ కామెంట్లు చేస్తున్నారు.


