ఫ్రీ విమాన టికెట్ అడిగిన ప్యాసింజర్
‘నో’అని రైనైర్ సెటైర్ జవాబు
విమాన ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చుని అద్భుతమైన ఫొటో తీసి, దాన్ని చూపించి ‘ఒక ఫ్రీ టికెట్ ఇస్తారా?’ అని మీరెప్పుడైనా అడిగారా? అడిగి ఉండరు కదా.. ‘రైనైర్’.. అంటేనే, టికెట్ ధర కంటే లగేజ్ రుసుము ఎక్కువ ఉండే బడ్జెట్ ఎయిర్‌లైన్ అని ప్రపంచం మొత్తం తెలుసు.
అలాంటిది.. ఐర్లాండ్ దేశానికి చెందిన ఈ ఎయిర్‌లైన్‌ని ఫ్రీ టికెట్ అడగడం అంటే.. గోతికాడ నక్కని బిర్యానీ అడిగినట్లే.. ఓకే, కథలోకి వెళ్దాం. అనగనగా ఒక తింగరోడు విమానంలో రోమ్ నగరం మీదుగా వెళ్తున్నాడు. ఆకాశం నీలం, కింద ఇటలీ రాజధాని నగరం అద్భుతంగా కనిపిస్తున్నాయి. వెంటనే తన మొబైల్‌లో ఓ అద్భుతమైన ఏరియల్ షాట్ తీశాడు. అందులో విమానం రెక్క, కింద పట్నం కళ్లకు విందు చేసేలా ఉన్నాయి.
ఫొటో తీశా చూడండి..
ఆ ఫొటో చూశాక మనోడిలో ఆశ చిగురించింది. ‘ఆహా! ఈ ఫొటోకి కనీసం ఒక ఫ్రీ టికెట్ అడగాల్సిందే!’ అనుకున్నాడు. ఇంకేముంది, ఆలస్యం చేయకుండా, ఆ గొప్ప ఫొటోను ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. దానిని రైనైర్ ఎయిర్‌లైన్‌కి ట్యాగ్ చేశాడు. ‘ఈ అద్భుతమైన ఫొటోకి బదులుగా నాకు ఒక ఉచిత విమాన టికెట్ ఇవ్వగలరా?’.. అని మరీ అమాయకంగా అడిగాడు. దానికి ఏదో నవ్వుతూ, నాలుగు మంచి మాటలు చెబుతారని, లేదా ఓ నవ్వుతున్న ఎమోజీ పంపిస్తారని ఆశించినట్లున్నాడు పాపం.
ఒక్క మాటతో కథ క్లోజ్!
రైనైర్ సోషల్ మీడియా టీమ్ ఉంది చూశారూ.. వాళ్లు సామాన్యులు కారు. వీళ్లు వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్లు. విషయం ఏంటంటే, వారు నిమిషం కూడా ఆలోచించకుండా, మర్యాదలన్నీ తుంగలో తొక్కి.. కేవలం ఒక్కే ఒక్క మాట.. నో.. (లేదు) అని జవాబిచ్చారు. అతన్ని ఏ మాత్రం నొప్పించకుండా, నెప్పి తెలియకుండా.. ఒక్కే ఒక్క పదంతో ‘గేట్’ మూసేశారు. అడగ్గానే ‘ఫ్రీ టికెట్’ దొరుకుతుందనుకున్న ఆ ప్రయాణికుడికి.. ఎయిర్‌లైన్ స్టైల్‌లో ముఖం మీదే ‘ఇక్కడ చపాతీ కూడా ఉచితంగా దొరకదు, నువ్వా ఫ్రీ టికెట్ అడుగుతున్నావ్?’ అని సూటిగా చెప్పినట్లయింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


