బాండీ బీచ్ ఘటనతో ఉగ్రవాది నవీద్ అక్రమ్ అరెస్ట్
కోమాలోంచి తేరుకోగానే అరెస్ట్‌చేసిన ఆస్ట్రేలియా పోలీసులు
మొత్తం 59 నేరాలు చేసినట్లు కేసు నమోదు
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ప్రముఖ బాండీ బీచ్ సమీప ఆర్చర్ పార్క్‌లోని యూదులపై విచక్షణా రహితంగా రైఫిళ్లతో కాల్పులు జరిపి పలువురిని పొట్టనబెట్టుకున్న 24 ఏళ్ల నవీద్ అక్రమ్‌ను పోలీసులు ఆస్పత్రిలోనే అరెస్ట్‌చేశారు. బీచ్‌లో ఇష్టారీతిగా కాల్పులు జరుపుతున్న నవీద్‌పైకి భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడటంతో అతన్ని సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యపరిస్థితి విషమించి తర్వాత నవీద్ కోమాలోకి వెళ్లాడు. కోమాలో ఉన్న నవీద్ బుధవారం కళ్లు తెరచి కోలుకోగానే ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు.
15 మందిని చంపినందుకు 15 నేరాలు, ఉగ్రవాద చర్యతో పలువురిని పొట్టనబెట్టుకోవడం, పలువురిని గాయపర్చడం, అక్రమంగా ఆయుధాలు కల్గి ఉండటం, దుర్వినియోగపర్చడం, ఒక భవంతి సమీపంలో బాంబు అమర్చడం, కారులో పేలుడు పదార్థాలను పెట్టడం వంటి అంశాలపై మరో 40కిపైగా నేరాలను ఆ కేసులో పేర్కొన్నారు. నవీద్ కారులో ఇప్పటికే ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండాలను పోలీసులు గుర్తించడంతో అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాల నేరాన్ని సైతం కేసుకు జతచేశారు. మొత్తంగా 59 నేరాలు చేసినట్లుగా అతనిపై కేసు నమోదుచేశారు.
వెలుగులోకి మరో జంట సాహసం
50 ఏళ్ల ఉగ్రవాది సాజిద్, అతని కుమారుడు నవీద్ సమీప పార్క్ పాదచారుల వంతెన వద్ద కాల్పులతో తెగబడుతున్నప్పుడు వారిని అడ్డుకునేందుకు ఒక వృద్ధజంట ప్రయత్నించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరిస్, సోఫియా గుర్మాన్ అనే వృద్ధ జంట అటుగా వెళ్తున్నప్పుడే ఈ తండ్రీకొడుకులు కాల్పులు మొదలెట్టినట్లు తెలుస్తోంది. వెంటనే వీళ్లను అడ్డుకునేందుకు బోరిస్, సోఫియా విశ్వప్రయత్నంచేశారు.
షూటర్ల చేతుల్లోని రైఫిళ్లను లాక్కునే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో దంపతులిద్దరూ కిందపడ్డారు. రైఫిల్ మాత్రం షూటర్ చేతుల్లోనే ఉండిపోయింది. దీంతో షూటర్ జరిపిన కాల్పులకు దంపతులిద్దరూ నేలకొరి వీరమరణం పొందారని ఆస్ట్రేలియా మీడియా వారిని సాహసోపేత చర్యను పొగిడింది. పలువురిని కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన దంపతులను కీర్తిస్తూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు లక్షలాదిగా పోస్ట్‌లు పెడుతున్నారు. షూటర్ల మీదకు ఇటుకలు విసిరి, గాయపరిచేందుకు ప్రయత్నించిన 60 ఏళ్ల తన తండ్రి రీవెన్ మోరిస్ సైతం ప్రాణాలు కోల్పోయారని కూతురు వెల్లడించారు.


