breaking news
rifle fire
-
బెడ్ మీదే బేడీలు !
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ప్రముఖ బాండీ బీచ్ సమీప ఆర్చర్ పార్క్‌లోని యూదులపై విచక్షణా రహితంగా రైఫిళ్లతో కాల్పులు జరిపి పలువురిని పొట్టనబెట్టుకున్న 24 ఏళ్ల నవీద్ అక్రమ్‌ను పోలీసులు ఆస్పత్రిలోనే అరెస్ట్‌చేశారు. బీచ్‌లో ఇష్టారీతిగా కాల్పులు జరుపుతున్న నవీద్పైకి భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడటంతో అతన్ని సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యపరిస్థితి విషమించి తర్వాత నవీద్ కోమాలోకి వెళ్లాడు. కోమాలో ఉన్న నవీద్ బుధవారం కళ్లు తెరచి కోలుకోగానే ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. 15 మందిని చంపినందుకు 15 నేరాలు, ఉగ్రవాద చర్యతో పలువురిని పొట్టనబెట్టుకోవడం, పలువురిని గాయపర్చడం, అక్రమంగా ఆయుధాలు కల్గి ఉండటం, దుర్వినియోగపర్చడం, ఒక భవంతి సమీపంలో బాంబు అమర్చడం, కారులో పేలుడు పదార్థాలను పెట్టడం వంటి అంశాలపై మరో 40కిపైగా నేరాలను ఆ కేసులో పేర్కొన్నారు. నవీద్ కారులో ఇప్పటికే ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండాలను పోలీసులు గుర్తించడంతో అంతర్జాతీయ ఉగ్రసంస్థతో సంబంధాల నేరాన్ని సైతం కేసుకు జతచేశారు. మొత్తంగా 59 నేరాలు చేసినట్లుగా అతనిపై కేసు నమోదుచేశారు. వెలుగులోకి మరో జంట సాహసం50 ఏళ్ల ఉగ్రవాది సాజిద్, అతని కుమారుడు నవీద్ సమీప పార్క్ పాదచారుల వంతెన వద్ద కాల్పులతో తెగబడుతున్నప్పుడు వారిని అడ్డుకునేందుకు ఒక వృద్ధజంట ప్రయత్నించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరిస్, సోఫియా గుర్మాన్ అనే వృద్ధ జంట అటుగా వెళ్తున్నప్పుడే ఈ తండ్రీకొడుకులు కాల్పులు మొదలెట్టినట్లు తెలుస్తోంది. వెంటనే వీళ్లను అడ్డుకునేందుకు బోరిస్, సోఫియా విశ్వప్రయత్నంచేశారు. షూటర్ల చేతుల్లోని రైఫిళ్లను లాక్కునే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో దంపతులిద్దరూ కిందపడ్డారు. రైఫిల్ మాత్రం షూటర్ చేతుల్లోనే ఉండిపోయింది. దీంతో షూటర్ జరిపిన కాల్పులకు దంపతులిద్దరూ నేలకొరి వీరమరణం పొందారని ఆస్ట్రేలియా మీడియా వారిని సాహసోపేత చర్యను పొగిడింది. పలువురిని కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన దంపతులను కీర్తిస్తూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు లక్షలాదిగా పోస్ట్‌లు పెడుతున్నారు. షూటర్ల మీదకు ఇటుకలు విసిరి, గాయపరిచేందుకు ప్రయత్నించిన 60 ఏళ్ల తన తండ్రి రీవెన్ మోరిస్ సైతం ప్రాణాలు కోల్పోయారని కూతురు వెల్లడించారు. -
జైపూర్ ఎక్స్‌ప్రెస్ కాల్పులు.. అకారణంగా కాల్చేశాడా?
ముంబయి: జైపూర్-ముంబయి సూపర్‌ఫాస్ట్ రైలులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రన్నింగ్ ట్రైన్లో తోటి సహోద్యోగులతో సహా ప్రయాణికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్తో సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వేస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జైపూర్-ముంబయి సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(12956) జైపూర్ నుంచి ముంబయి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్‌గా గుర్తించారు. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న క్రమంలో ఘటనకు పాల్పడ్డాడు. బాధితుడు ఏఎస్ఐ టికారమ్ మీనాగా గుర్తించారు. టికారమ్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు చేతన్ సింగ్ షార్ట్ టెంపర్ అని పశ్చిమ రైల్వే ఎన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్పీఎఫ్ అధికారి ప్రవీణ్ సిన్హా తెలిపారు. ఎస్కార్ట్ డ్యూటీలో అధికారుల మధ్య ఎలాంటి వివాదం జరగలేదని వెల్లడించారు. రైలు జైపూర్ నుంచి మహారాష్ట్రాలోని పాల్ఘర్కు చేరగానే కానిస్టేబుల్ చేతన్ సింగ్ అకారణంగానే కోపానికి లోనై తోటి అధికారులపై కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. సీనియర్ అధికారిపై కాల్పులు జరిపిన అనంతరం బోగీ నెంబర్ బీ5 లో ఓ ప్రయాణికునిపై ఫైరింగ్ జరిపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బోగీ బీ6లో మరో ఇద్దరు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. నిందితుడు మొత్తం 12 రౌండ్లు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీనియర్ అధికారితో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఘటనా సమయంలో విధుల్లో మొత్తం ముగ్గురు కానిస్టేబుల్స్‌తో పాటు సీనియర్ ఏఎస్ఐ అధికారి ఉన్నట్లు గుర్తించారు. కాల్పులు జరిపిన అనంతరం దాహితార్ స్టేషన్ పరిధిలో రైలు చైన్ లాగి నిందితుడు పారిపోయాడని పోలీసులు గుర్తించారు. అయితే.. నిందితున్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రైలు జైపూర్ నుంచి వస్తున్న క్రమంలో గుజరాత్‌లోని సూరత్ రాగానే.. ఈ ఆర్ఫీఎఫ్ పోలీసులు ఎస్కార్ట్ డ్యూటీ విధుల్లో చేరారని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ అధికారి టికారమ్ మీనాకు రూ.15 లక్షల పరిహారాన్ని పశ్చిమ రైల్వే ప్రకటించింది. కాగా.. టికారమ్‌కు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. 80 ఏళ్ల తల్లి ఉంది. 2025లో ఆయన రిటైర్మెంట్ తీసుకోనుండగా.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: 'పాక్ వెళ్లిన అంజు ఘటనలో అంతర్జాతీయ కుట్ర కోణం' -
పార్లమెంట్ లో ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ హౌస్ లో సీఆర్ఫీఎఫ్ జవాను చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్నిరోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పార్లమెంట్ డ్యూటీ గ్రూపు(పీడీజీ)కు చెందిన సెక్యురిటీ గార్డు చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలి నాలుగు బుల్లెట్లు బయటకు దూసుకువచ్చాయని సీఆర్ఫీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హాసన్ చెప్పారు. ఈ బుల్లెట్లు ఎవరినీ తాకలేదని తెలిపారు. అత్యంత సున్నిత ప్రాంతమైన పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఈ ఘటన జరిగిందన్నారు. పేలుడుకు కారణమైన సెక్యురిటీ గార్డును విధుల నుంచి తొలగించినట్టు చెప్పారు. అతడి వద్ద నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.


