ఒమన్ ఉప ప్రధానమంత్రితో మోదీ భేటీ
నేడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు!
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ ఉప ప్రధానమంత్రి సయీద్ షిహాబ్ బిన్ తారిఖ్ అలీ సైద్‌తో సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ ఇథియోపియా నుంచి బుధవారం ఒమన్‌కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఉప ప్రధానమంత్రి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మోదీ గురువారం ఒమన్ ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
ఈ సందర్భంగా కీలకమైన వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేసే అవకాశం ఉంది. భారత్, ఒమన్ మధ్య చరిత్రాత్మకమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన పర్యటనలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు మోదీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన ఇక్కడికి రావడం ఇది రెండోసారి.
భారత్–ఒమన్ దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఒమన్‌లోని మస్కట్‌లో తాను బస చేసే హోటల్‌కు చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేశారు. భారతీయ కళాకారులు సైతం సాంస్కృతి కార్యక్రమాలు ప్రదర్శించారు. అలాగే భారత్–ఒమన్ సంబంధాలను ప్రతిబింబించే ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
ఒమన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ గత శుక్రవారమే ఆమోదించింది. దీనిపై 2023 నవంబర్‌లో చర్చలు మొదల య్యాయి. ఈ ఏడాది విజయవంతంగా ముగి శాయి. ఒప్పందంపై సంతకాలు జరిగితే రెండు దేశాల వాణిజ్య సంబంధాల్లో నూతన ఆధ్యాయం ప్రారంభమైనట్లేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మోదీ ఒమన్ సుల్తాన్‌తో భేటీ కాబోతున్నారు. వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై వారు చర్చించనున్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.


