ట్రంప్ నిర్ణయం, ఉత్తర్వులు
వాషింగ్టన్: అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేదించిన దేశాల జాబితాను ట్రంప్ యంత్రాంగం మరింత విస్తరించింది. మరో 20 దేశాలను తాజాగా అందులోకి చేర్చింది. అమెరికా జాతీయ భద్రత, ప్రజల భద్రత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సంబంధిత ఉత్తర్వులపై అధ్యక్షుడు మంగళవారం సంతకం చేశారు. బుర్కినా ఫాసో, మాలీ, నైగర్, దక్షిణ సుడాన్, సిరియాపై పూర్తి ఆంక్షలు, అమెరికాలోకి ప్రవేశంపై నిషేధం విధించారు.
మరో 15 దేశాలైన అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోటె డి ఐవోయిర్, డొమినికా, గాబన్, ద గాంబియా, మలావీ, మార్షియానా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక నిషేధ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘ఈ దేశాలకు అమెరికా చట్టంపై గౌరవం లేదు. తన పౌరుల గురించిన సమగ్ర సమాచారం పొందుపరచడంలో అమెరికా నిఘా, భద్రతా, ఇమ్మిగ్రేషన్ విభాగాలకు అందించడంలో తరచూ విఫలమవుతున్నాయి‘ అని తెలిపారు. పాలస్తీనా అథారిటీ తాలూకు పత్రాలున్న వారి ప్రవేశాన్ని నిషేధించారు. వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పలు ఉగ్ర మూకలు చురుగ్గా పనిచేస్తున్నాయి. అమెరికా పౌరులను పొట్టన పెట్టుకున్నాయి. అందుకే ఈ చర్య’ అని వైట్ హౌస్ పేర్కొంది.
వాటిపై కొనసాగింపు
అఫ్గానిస్తాన్, బర్మా సహా 12 దేశాలపై ఇటీవలే అమెరికా నిషేధం విధించడం తెలిసిందే. అది ఇకముందు కూడా కొనసాగనుంది. గత నెలలో ఒక అఫ్గాన్ దేశస్తుడు వాషింగ్టన్‌లో ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బందిని కాల్చి చంపడం తెలిసిందే. ఆ నేపథ్యంలో అఫ్గాన్‌తో పాటు ఇలా పలు మూడో ప్రపంచ దేశాలపై అమెరికా కఠిన నిషేధాలు విధిస్తూ వస్తోంది.


