చైనా-పాకిస్థాన్‌కు మధ్య చెడింది ఇక్కడే..! | Cracks In China And Pakistan Relations: What Are The Reasons | Sakshi
Sakshi News home page

చైనా-పాకిస్థాన్‌కు మధ్య చెడింది ఇక్కడే..!

Dec 17 2025 8:18 PM | Updated on Dec 17 2025 9:05 PM

Cracks In China And Pakistan Relations: What Are The Reasons

‘దోస్త్ మేరా దోస్త్.. నువ్వే నా ప్రాణం’.. అంటూ ఏక కంఠంతో చెప్పిన చైనా-పాకిస్థాన్ మధ్య దోస్తీ ఇప్పుడు చెడిందా..! పాకిస్థాన్ ఆవిర్భావం నుంచి డ్రాగన్‌తో కలిసే ఉన్నా.. ఇంత సడెన్‌గా ఎందుకు చైనా దూరమవుతోంది..? షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ మాదిరిగా కలిసి ఉండే చైనా-పాకిస్థాన్‌లు ఇప్పుడు విడిపోవడానికి కారణాలేమిటి..? ఇంతకాలం చైనా నుంచి ఇతోధికంగా సాయం పొందిన పాకిస్థాన్.. ఉన్నఫళంగా ఎందుకు రూట్ మార్చింది..? భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జియోపాలిటిక్స్ ఇంత వేగంగా మారిపోవడానికి దోహదపడిన అంశాలేమిటి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..

సిల్క్ రోడ్ మాదిరి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను నిర్మించింది. దీని కోసం చైనా ఎన్నో బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనే షీ జిన్‌పింగ్ కలను సాకారం చేసే దిశలో పాకిస్థాన్ సీపీఈసీకి సహకరించింది. అంతేకాదు.. పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేసి, తనకు అనుకూలంగా మలచుకోవాలనుకుంది. భారత్‌కు ధీటుగా పాకిస్థాన్‌ను ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసింది. అంతెందుకు.. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్య రాజ్య సమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై గళమెత్తిన ప్రతీసారి.. చైనా రొటీన్‌గా ఆధారాలేవి? అంటూ ప్రశ్నించేది. అలా పాలు-నీళ్లలా చైనా-పాకిస్థాన్ బంధం కొనసాగింది. భారత్‌కు చెక్ పెట్టేలా ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌కు అధునాతన యుద్ధ విమానాలు, రక్షణ పరికరాలను సరఫరా చేయడంలో చైనా ముందంజలో ఉండేది. అంతెందుకు.. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు వాడే తూటలాలు.. ముఖ్యంగా స్టీల్ బుల్లెట్లు కూడా చైనా సరఫరా కావడం గమనార్హం..! సంక్షోభ సమయాల్లోనూ పాక్‌కు చైనా వెన్నంటే ఉంది.

చైనా-పాకిస్థాన్‌ల చైనా బంధం దశాబ్దాలుగా కొనసాగింది. పాకిస్థాన్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పాలకులు మాత్రం చైనాకు అనుకూలంగా ఉండడం రివాజుగా మారింది. చివరకు సైనిక పాలన కొనసాగినా.. సైన్యాధికారులు చైనాకు తొత్తులగానే పనిచేసేవారు. నిజానికి చైనా మతరహిత సమాజాన్ని కోరుకుంటే.. పాకిస్థాన్ మాత్రం ఫక్తుగా ఇస్లామిక్ దేశం. ఇంకా చెప్పాలంటే.. చైనాలో మైనారిటీలుగా ఉన్న ముస్లింలపై మారణకాండ కొనసాగినా.. పాకిస్థాన్ మాత్రం చైనాకు వంతపాడేది.

అంటే.. సిద్ధాంతపరంగా వేర్వేరు భావజాలాలున్నా.. ‘అవసరం’ అనే ఒకే ఒక్క పదం ఈ రెండు దేశాలను ఫ్రెండ్స్‌గా మార్చేశాయి. జియోపాలిటిక్స్‌ అనే రాజనీతితో ఇరుదేశాలు సఖ్యతను ప్రదర్శించాయి. బలూచిస్థాన్‌లో వ్యతిరేకత పెరిగినా.. పాకిస్థాన్ మాత్రం చైనా కోసం అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. బలూచిస్థాన్‌లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను చైనాకు కట్టబెట్టేందుకు పాకిస్థాన్ ఇప్పుడు బలూచీలపై కత్తిదూస్తోంది. వారి ఆగ్రహ జ్వాలలకు సొంత సైన్యం, పోలీసులు బలవుతున్నా.. మొండిధోరణితో ముందుకు సాగింది.

పాలు-నీళ్లుగా స్నేహ బంధంలో మునిగితేలిన చైనా-పాకిస్థాన్ ఇప్పుడు ఉప్పు-నిప్పులా మారిపోతున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’తో భారత రక్షణశాఖ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. భారత డిఫెన్స్‌తోపాటు.. అఫెన్స్ కెపాసిటీకి అగ్రదేశాలు సైతం అద్దిరిపోయాయి..! అందుక్కారణం.. ఈ రెండు అంశాల్లో భారతే టాప్ అన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేశాయి. డిఫెన్స్‌లో తోపులమనుకునే ఇజ్రాయెల్, రష్యా, అమెరికా కంటే.. ఎంతో ముందంజలో ఉన్నట్లు ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించింది.

అమెరికా తయారీ ఎఫ్-16, చైనా తయారీ జే-10సీ వంటి అధునాతన యుద్ధ విమానాలున్నా.. పాకిస్థాన్ చతికిలపడిపోయింది. అదే సమయంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాంతో.. భారత్‌కు చెక్ పెట్టాలని అమెరికా నిర్ణయించింది. ఓవైపు సుంకాల భారం మోపుతూనే.. మరోవైపు పాకిస్థాన్‌ను పావులా వాడుకోవాలని వ్యూహాలు రచించింది. అదే సమయంలో చైనాకు పోటీగా పాకిస్థాన్‌లోని ఓ పోర్టును అభివృద్ధి చేసి, బలూచిస్థాన్‌లోని అపారమైన ఖనిజ సంపదను దోచుకోవాలని ప్లాన్ చేసింది. దాన్ని అర్థం చేసుకోకుండా.. తమకు పెద్దన్న పెద్దపీట వేస్తున్నాడనే ఉద్దేశంతో పాకిస్థాన్ ట్రంప్‌ను గుడ్డిగా నమ్మేసింది..!

అమెరికాను బద్ధ శత్రువుగా భావించే చైనా.. ఇప్పుడు పాకిస్థాన్ నిర్ణయంతో షాక్ అయ్యింది. దాంతో.. పాకిస్థాన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది. 2013 నుంచి వ్యూహాత్మకంగా గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసినా.. ఇప్పుడు పాక్‌కు దూరంగా ఉంటోంది. అయితే.. హోర్మూజ్ జలసంధి నుంచి గ్వాదర్ పోర్టు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనాకు సరఫరా అయ్యే చమురు ఈ పోర్టు మీదుగానే వస్తుంది. అక్కడి నుంచి సీపీఈసీ ద్వారా గిల్గిట్-బాల్టిస్థాన్‌కు.. అక్కడి నుంచి జిన్జియాంగ్‌కు చమురు చేరుకుంటుంది. వ్యూహాత్మకంగా శత్రుదేశాల యుద్ధ నౌకలను అడ్డుకునేందుకు గ్వాదర్ పోర్టును అడ్డాగా మార్చుకోవాలని చైనా భావించింది.

ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకలు ఈ మార్గం మీదుగానే దక్షిణాసియాకు రావాల్సి ఉంటుంది. అయితే.. పాకిస్థాన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన చైనా.. ఇప్పుడు వాటిని అప్పుగా చూపించి, వసూలు చేసుకుంటుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పైగా.. బలూచిస్థాన్, ఖైబర్ పంఖ్తుంఖ్వాల్లో రోడ్లను చైనా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో లభించే అరుదైన ఖనిజ సంపదను అమెరికాకు ఎగుమతి చేసే దిశలో పాకిస్థాన్ అడుగులు వేస్తోంది. దీన్ని చైనా సహిస్తుందా??

గ్వాదర్ పోర్టు నుంచి జిన్జియాంగ్ వరకు సీపీఈసీ, రైల్వేలు, విమానాశ్రయాలను అభివృద్ధి చేసిన చైనా.. వాటిని ఊరికే వదిలిపెడుతుందా??? ఇవన్నీ సమాధానాల్లేని ప్రశ్నలే..! గ్వాదర్‌కు సమాంతరంగా పజ్నీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ పరిణామాలకు చైనా ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే..!

-హెచ్.కమలాపతిరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement