పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్.. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కథ జైల్లోనే సమాప్తం కానుందా?.. మిగిలిన జీవిత కాలం ఆయన జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా??.. పీటీఐ వర్గాలు, ఖాన్ కుటుంబ సభ్యుల ఆందోళలను హెష్‌బాజ్ షరీఫ్ ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందా?.. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లను అసలు పట్టించుకోవడం లేదా?..
‘మా తండ్రిని మళ్లీ చూడలేమేమో’.. అంటూ ఇమ్రాన్ ఖాన్ తనయులు చెబుతున్న ఈ మాట పీటీఐ వర్గాలను, ఆయన అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా సంస్థ స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ ఇద్దరు కొడుకులిద్దరూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఖాసిమ్ ఖాన్.. మా తండ్రికి(ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి..) రెండేళ్లుగా ఇతరులతో సంబంధాలు లేకుండా చేశారు. ఒక సెల్‌లో ఒంటరిగా బంధించారు. తాగడానికి ఆయనకు మురికి నీరు ఇస్తున్నారు. ఆయన చుట్టూ హెపటైటిస్‌తో బాధపడుతున్న ఖైదీలు ఉన్నారు అని అన్నాడు.
మరో కొడుకు సులేమాన్ ఇసా ఖాన్ తన తండ్రి ఉంది డెత్ సెల్‌లో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైల్లో ఆయనతో ఎవరూ మాట్లాడకూడదనే ఆంక్షలు పెట్టారు. చివరకు జైలు గార్డులు కూడా ఆయన్ని పలకరించడానికి వీల్లేదు. పాక్ ప్రభుత్వం ఆయన విషయంలో సైకాలజికల్ టార్చర్ స్ట్రాటజీ అవలంభిస్తోంది అని ఆరోపించారు. పరిస్థితి పోనుపోను మరింత కఠినంగా మారుతోంది. ఆశను నిలుపుకోవడం కష్టమవుతోంది. ఇక ఆయనను మళ్లీ చూడలేమేమోనని భయపడుతున్నాం అని ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 22 నెలలుగా తాము తండ్రిని కలవలేకపోయామని.. జనవరిలో తాము ఇస్లామాబాద్ వెళ్తామని.. ఎలాగైనా ఆయన్ని కలిసి తీరతామని అంటున్నారు.
మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడిపించేందుకు పీటీఐ పోరాటం చేస్తోంది. ఆయన సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖానుం, నూరీన్ ఖాన్ నియాజీ ఆ నిరసనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వివిధ దేశాల అధినేతలకు, ప్రముఖులకు ఇమ్రాన్ ఖాన్ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. అయితే వాటికి ఫలితం కనిపించడం లేదు. అదే సమయంలో..
ఇమ్రాన్ ఖాన్‌పై దేశ ద్రోహం పెట్టాలని షెహబాజ్ షరీఫ్ సర్కార్ యోచిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కుట్ర ఉందనేది ఖాన్ కుటుంబం చెబుతున్న మాట. ఈ పరిణామాల నడుమ.. ఖాన్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇమ్రాన్ ఖాన్ విడుదల డిమాండ్‌తో పాటు పీటీఐ కార్యాలయాల మూసివేత.. కీలక నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరవధిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. రావల్పిండిలోని ఆడియాలా జైలు సమీపంలోని ఫ్యాక్టరీ నాకా వద్ద ఈ నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే షెహబాజ్ ప్రభుత్వం రావల్పిండిలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించుకోకుండా కఠిన ఆంక్షలు విధించింది. అయితే.. ఆ ఆంక్షలను అణచివేతగా పేర్కొంటూ ఖాన్ సోదరీమణులు స్వయంగా ఈ దీక్షల్లో పాల్గొనబోతున్నారు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో 840 అనే రాతలు(ఖాన్‌కు కేటాయించిన ఖైదీ నెంబర్) కనిపిస్తున్నాయి.
నాటి నుంచి..
పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి కోల్పోయారు. ఆ మరుసటి ఏడాది.. తోషాఖానా అవినీతి కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) మార్చి 24న వారానికి రెండు సార్లు (మంగళవారం, గురువారం) సందర్శకులను అనుమతించాలని ఆదేశించింది. అయితే PTI ఈ ఆదేశాలు అమలు కావడం లేదని ఆరోపిస్తోంది.
జైల్లో ఉన్నప్పటికీ ములాఖత్‌ల ద్వారా ఇమ్రాన్ ఖాన్ సందేశాన్ని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గీయులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా చెబుతూ వస్తున్నారు. అయితే.. ఆర్మీ చీఫ్ అసిం మునీర్, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశాక.. ఆయన నుంచి ఎలాంటి చప్పుడు లేదు.
ములాఖత్‌లకు అడియాలా జైలు అధికారులు అనుమతించకపోవడమే అందుకు కారణంగా తెలిసింది. అయితే జైల్లో ఆయన భద్రంగానే ఉన్నారా?.. సజీవంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అనే అనుమానాలతో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ పరిణామాల నడుమ ఖాన్ సోదరీమణికి 20 నిమిషాల ములాఖత్‌కు అవకాశం దక్కింది. ఆ సమయంలో ఆయన జైల్లో మానసికంగా కుంగిపోయి ఉన్నారని అన్నారామె. అయితే అటుపైనా ములాఖత్‌లకు పోలీసుల ఆటంకాలు ఎదురయ్యాయి. ఒకానొక దశలో పీటీఐ కార్యకర్తలు జైల్లోకి దూసుకెళ్లే ప్రయత్నంగా చేయగా.. వాటర్ కెనన్‌లతో చెదరగొట్టారు.
భారత్ రియాక్షన్ ఇదే..
ఇమ్రాన్ ఖాన్ జైలు నిర్బంధంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక ఒంటరి నిర్బంధంలో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న ఐక్యరాజ్య సమితి.. పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచే ప్రనయత్నంలో ఉంది. పాక్ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారే అవకాశం లేకపోలేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రరాజ్యంతో పాటు యూరప్ దేశాలు న్యాయమైన విచారణ జరగాలని, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై ఇంతదాకా ఎక్కడా స్పందించలేదు. కానీ, అది పాక్ రాజకీయ సంక్షోభంగా మాత్రం భావిస్తోంది. ఇక గల్ప్ దేశాలు ప్రత్యక్షంగా స్పందించకపోయినప్పటికీ.. అక్కడి ప్రవాస పాకిస్తానీలు మాత్రం #FreeImranKhan పేరిట నిరసనలు చేపడుతున్నారు.
ఖాన్ కొడుకులు లండన్‌లో..
ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పటిదాకా మూడుసార్లు వివాహం జరిగింది. మొదటి భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ బ్రిటిష్ జర్నలిస్గ్. 1995లో వీళ్ల వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కొడుకులు. అయితే.. 2004లో విడాకులు తీసుకున్నాక ఆమె పిల్లలతో లండన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెహామ్‌ను ఖాన్ 2015 వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహ బంధం ఎన్నో రోజులు నిలవలేదు.
2018లో బుష్రా బీబీ (బుష్రా మానేకా)ను వివాహం చేసుకున్నారు. అయితే.. అవినీతి ఆరోపణల్లో ఖాన్‌తో పాటు అరెస్ట్ అయిన ఆమె అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.


