సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమానికి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రత్యక్షంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ ఎల్పీ భేటీ కానుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది.
నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా చేస్తోందని బీఆర్‌ఎస్ మండిపడుతోంది. తెలంగాణకు సాగునీటి విషయంలో బీజేపీ కూడా అన్యాయం చేస్తుందని బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి బీజేపీ సహకరిస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎదుర్కొంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో బీఆర్‌ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం పాల్గొంటుంది. తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.


