ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అత్తింటివారి యత్నం
అదనపు కట్నం కోసం దారుణ
పరారీలో భర్త, అత్తామామ, మరిది
మహబూబాబాద్ రూరల్: వారిది ప్రేమ వివాహం.. అయినా కొంతకట్నం ఇచ్చారు. పెళ్లయిన ఏడాదినుంచే అదనపు కట్నం తేవాలంటూ భర్తతోపాటు అత్తామామ, మరిది వేధింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమెను దారుణంగా కొట్టి చంపి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు యత్నించారు. ఈ దారుణం మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
గ్రామస్తులు, మృతురాలి తల్లి కౌసల్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ అర్జున్, కౌసల్య దంపతుల కూతురు స్వప్న (26) అదే గ్రామానికి చెందిన బానోత్ కిషన్, బుజ్జి దంపతుల కుమారుడు రామన్న ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో 15 ఏళ్ల క్రితం రూ.3 లక్షల కట్నం, 8 తులాల బంగారం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.
పెళ్లి జరిగిన సంవత్సరం నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తుండగా పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, అదనపు కట్నం కింద ఎకరం భూమి కూడా ఇచ్చారు. అయినప్పటికీ అత్తింటివారి వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలోనే ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు జని్మంచారు. ఇటీవల మళ్లీ అదనపు కట్నం కావాలంటూ స్వప్నపై వేధింపులు పెరిగాయి.
గత మూడు రోజులుగా అత్తామామలు కిషన్, బుజ్జి, భర్త రామన్న, మరిది నవీన్ స్వప్నను చిత్రహింసలుపెట్టి, కిరాతకంగా కొట్టారు. శనివారం రాత్రి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోతుందని భయపడిన వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్వప్నను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని చెప్పారు. దీంతో కేసు తమపైకి వస్తుందని భావించిన అత్తామామలు, భర్త, మరిది మళ్లీ స్వప్న మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఆమె నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు నమ్మించాలని చూశారు.
ఈ విషయం మృతురాలి గ్రామస్తులు, తల్లిదండ్రులకు తెలియగానే వారంతా రామన్న ఇంటికి చేరుకుని ఆగ్రహంతో అత్తింట్లో ఫరి్నచర్, టీవీ, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. అప్పటికే మృతురాలి అత్తామామలు, భర్త, మరిది పరారీలో ఉన్నారు. రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


