తొలి విడత కంటే 1.58% ఎక్కువ
టాప్‌లో యాదాద్రి భువనగిరి..లాస్ట్‌లో నిజామాబాద్
ఏకగ్రీవాలు మినహా మొత్తం 7,745 పంచాయతీలకు ముగిసిన ఎన్నికలు
17న చివరి దఫాలో 3,759 పంచాయతీలకు పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లో మరింత భారీగా పోలింగ్ నమోదైంది. తొలివిడత ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్‌నమోదు కాగా.. రెండో విడతలో 1.58 శాతం ఎక్కువగా 85.86% ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. మొత్తం మీద రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌కేంద్రా ల వద్ద ఓటర్లు బారులు తీరారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ముగియగా, ఆలోపు క్యూలైన్‌లో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతించారు. పోలింగ్‌ముగిశాక కౌంటింగ్‌ప్రారంభించి విజేతలను ప్రకటించారు. ఏకగ్రీవాలను మినహా యిస్తే రెండు విడతల్లో కలిపి 7,745 పంచాయతీలకు ఎన్నికలు ముగియగా, మూడో దఫాలో భాగంగా ఈ నెల 17న మరో 3,759 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
మహిళా ఓటర్లే ఎక్కువ..
రెండో దఫాలో 3,911 పంచాయతీలకు, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. మొత్తం 54,40,339 మంది ఓటర్లకు గాను 46,70,972 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72%, ఖమ్మం జిల్లాలో 91.21% పోలింగ్ నమోదు అయ్యింది. అత్యల్పంగా నిజామాబాద్‌జిల్లాలో 76.71%, జగిత్యాలలో 78.34% ఓటింగ్ నమోదైంది.
పురుషుల కంటే మహిళా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ పాల్గొన్నారు. ఈ విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక మరో 416 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
యాదాద్రి జిల్లా టాప్
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఈసారి 54,40,339 ఓటర్లు ఉండగా.. 46,70,972 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 27,82,494 ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 22,77,902 మంది ఓటేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా 2,02,716 మంది ఓటర్లకు గాను..1,8,5937 మంది ఓటింగ్‌తో (91.72 శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,38,838 ఓటర్లు ఉండగా.. 1,83,219 మంది ఓటింగ్ (76.71 శాతం)తో చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లాలో 91.21%, సూర్యాపేట జిల్లాలో 89.55%, మెదక్88.74%, నల్లగొండ జిల్లాలో 88.74% నమోదు కాగా.. జగిత్యాల (78.34%), భద్రాద్రి కొత్తగూడెం (82.65%), నిర్మల్ (82.67%), వికారాబాద్ (82.72%)లో వరుసగా అత్యల్ప ఓటింగ్ నమోదైంది.
తగ్గిన పోస్టల్ బ్యాలెట్లు: పోలింగ్ ముగిసిన తర్వాత మ ధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. గతంతో పోలి స్తే ఈసారి పోస్టల్‌బ్యాలెట్‌ఓట్లు భారీగా తగ్గినట్లు అధికారు లు పేర్కొన్నారు. కాగా వార్డుల వారీగా ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. రెండో విడత ఎన్నికలు మొత్తం మీద ప్రశాంతంగా ముగిశాయి.
పోటెత్తిన మహిళలు
ఈ విడతలో మొత్తం మహిళా ఓటర్లు 27,82,494 మంది ఉండగా.. 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.62%, ఖమ్మం 90.88%, మెదక్ 89.28% అత్యధికంగా ఓటింగ్ నమోదు కాగా.. భద్రాద్రి కొత్తగూడెం 81.38%, వికారాబాద్ 81.79%, ములుగు 82.79% ఓటింగ్ నమోదైంది. పురుషుల ఓటింగ్ శాతంలో కూడా యాదాద్రి (91.83%), ఖమ్మం (91.56%) జిల్లాలే ముందంజలో ఉన్నాయి.
రాష్ట్రంలో ఎన్నికలు నోటిఫై అయిన పంచాయతీలు: 12,723
ఏకగ్రీవమైనవి: 1205
తొలిదశలో ఎన్నికలు జరిగినవి: 3,834
రెండో విడతలో జరిగినవి: 3,911
మూడో విడతలో జరిగేవి: 3,759
(మిగిలిన వాటిలో కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలు కాకపోగా, మరికొన్ని కోర్టు కేసులు ఇతర కారణాలతో ఎన్నికలు జరగడం లేదు)


