డ్రా... డ్రా.. కలిసొచ్చిన అదృష్టం
రెండో విడత పంచాయతీ ఫలితాల్లోనూ..తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనేక సర్పంచ్ స్థానాలకు సమాన ఓట్లు రాగా, లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఒక్క ఓటుతోనూ గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. పోటీలో ఉన్న వారి మేరకు విజ్ఞప్తి మేరకు రెండుమూడుసార్లు రీకౌంటింగ్ కూడా చేశారు.
ధర్మసాగర్/ హవేళిఘణాపూర్/అనంతగిరి/ వేములపల్లి /పుల్‌కల్/ ఎల్లారెడ్డిరూరల్/ కౌటాల/కాసిపేట: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశగూడెం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ మద్దతుతో ఎండీ సత్తార్, బీఆర్‌ఎస్ మద్దతుతో హఫీజ్ పోటీ చేశారు. 328 ఓట్లు పోల్ అవగా, సత్తార్, హఫీజ్‌లకు సమానంగా 164 ఓట్లు వచ్చాయి.
ఎన్నికల అధికారులు డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ సత్తార్‌ను విజయం వరించింది. టాస్ వేయాల్సి ఉండగా, డ్రా ఎందుకు తీశారని బీఆర్‌ఎస్ మద్దతుదారు హఫీజ్ నిరసన తెలుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మెదక్ మండలం చీపురుదుబ్బతండా సర్పంచ్ స్థానానికి బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి బీమిలి, కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీతకు చెరి 182 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీయగా.. సునీత సర్పంచ్ పీఠం కైవసం చేసుకుంది.
వికారాబాద్ మండలం జైదుపల్లి సర్పంచ్‌గా ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్లోళ్ల మౌనిక, నాగిరెడ్డికి 302 చొప్పున ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా నిర్వహించగా మౌనికను అదృష్టం వరించింది.
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురం సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చక్కని ఉపేంద్రమ్మ, బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీచేసిన సాయిని మౌనికకు సమానంగా 352 ఓట్ల చొప్పున వచ్చాయి. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఓట్లు సమానం రావడంతో ఇద్దరి మధ్య టాస్ వేశారు. టాస్ గెలిచిన ఉపేంద్రమ్మ సర్పంచ్ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా పుల్‌కల్ మండలం ముద్దాయిపేట గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డులో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు సమానమైన ఓట్లు పొందారు. దీంతో అధికారులు టాస్ వేశారు. టాస్‌లో శ్రీకాంత్‌ను విజయం వరించింది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మంగళి సంతోశ్‌కుమార్, పెంట మానయ్యలకు సరి సమానంగా 483 ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేసి మంగళి సంతోశ్‌కుమార్ సర్పంచ్‌గా గెలుపొందినట్టుప్రకటించారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లి సర్పంచ్ స్థానానికి జరగిన ఎన్నికలో బీఆర్‌ఎస్ బలపర్చిన రజినికాంత్‌కు 204 ఓట్లు రాగా, కాంగ్రెస్ మద్దతుదారు జాడి కావేరికి 204 ఓట్లు వచ్చాయి. లక్కీ డ్రాలో కావేరి పేరు రావడంతో ఆమె గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబాడితండా(కే) గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసిన బలరాం రాంచందర్‌లకు 193 చొప్పున ఓట్లు పోల్ అయ్యాయి. రీకౌంటింగ్ జరిపినా అవే ఓట్లు వచ్చాయి. డ్రాలో బలరాంను అదృష్టం వరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని వెంకాయపల్లిలో కాంగ్రెస్ మద్దతుతో వెంకటేశ్వరమ్మ, బీఆర్‌ఎస్ మద్దతుతో ఆలేటి ఇందు పోటీ చేశారు. ఇద్దరికి చెరి 236 ఓట్లు రాగాటాస్ వేయగా వెంకటేశ్వరమ్మ గెలిచారు.


