సాక్షి, శ్రీకాకుళం: పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లోమీడియా రాతలు రాయడం అన్యాయం, దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ‘‘గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్, విదేశీ దాడులకు సాఫ్ట్ టార్గెట్ అని రాశారని, విశాఖ భూకంపాల జోన్‌లో ఉంది. హైరిస్క్ ఏరియా అని రాశారని, గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతుంది, కాబట్టి రాజధానిగా చేయొద్దంటూ రాతలు రాశారని గుర్తు చేశారు.
‘‘ఇప్పుడు విశాఖపట్నం అద్బుతం, ఇక్కడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, బంగారం పండుతుంది, సిలికాన్ లభిస్తుంది, కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు విజన్ వల్లే విశాఖ ఇలా మారిపోతుందని రాస్తున్నారు’’ అంటూ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..
ఆ సంఘం సిఫార్సులంటూ పిచ్చిరాతలు:
పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు ఏడాదిగా చెబుతున్నారు. ప్రైవేటు గుత్తాధిపత్యం ఎక్కువైతే ఏం జరుగుతుందో ఇండిగో వ్యవహారంలో చూశాం. మన ఎంపీ కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారో చూశాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కాలేజీలు లేకపోతే మన పరిస్ధితి ఏంటో అంతా అలోచించాలి. వైద్య వ్యవస్థలు ప్రైవేటు చేతుల్లో ఉంటే కరోనా లాంటి విపత్తుల్లో ఏం జరిగి ఉండేదో ఆలోచించాలి.
ఇప్పుడు పార్లమెంటరీ స్దాయీ సంఘం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. నిజానికి కమిటీ ఏం చెప్పిందన్నది చూస్తే.. మెడికల్ కాలేజీల నిర్వహణకు ఎవరైనా ముందుకొస్తే రాయితీలు ఇవ్వాలని, అర్హులైన విద్యార్ధులుంటే స్కాలర్ షిప్పులు ఇవ్వాలని, వైద్య విద్యలో సీట్లు పెంచడం తప్పనిసరి అని పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పింది. వైద్య విద్య, సామాగ్రి ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే సిఫార్సు చేసింది.
అంతే తప్ప ఉన్నవాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని ఎక్కడా చెప్పలేదు. అదే వాస్తవమైతే ఎయిమ్స్, జిప్ మర్, ఐఐటీ వంటి సంస్థలు కూడా పీపీపీ విధానంలో పెట్టుకోవాలి కదా?. ప్రైవేటువాళ్లు ముందుకొస్తే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టాలని మాత్రమే పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్తే ఉన్న కాలేజీల్ని ప్రైవేటు చేతుల్లో పెడుతున్నారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం స్కాం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, వెన్నుపోటే కాదు పేదల కలకల్ని తుంచేయడమే అవుతుంది. దీనికి తోడు ప్రైవేటు ఆస్పత్రుల్లో జీతాలు కూడా ప్రభుత్వమే రెండేళ్ల పాటు ఇస్తుందంటున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎక్కడైనా విన్నామా ? భూములు, భవనాలు, ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు, జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే లాభాలు ప్రైవేటుకు ఇచ్చి, భారం పేదలపై వేస్తారా? ఇదీ చంద్రబాబు చెప్తున్న పీపీపీ మోడల్.
మొన్నటివరకూ పీపీపీ మోడ్ లో ఏర్పాటు చేసినా ప్రభుత్వం నిర్వహణ చూస్తుందన్నారు. అంటే జీతాలు ప్రభుత్వం ఇచ్చి లాభాలు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లడమా ?, ఇది కొత్త మౌలిక సదుపాయాల కల్పన కాదు, ఉన్న వాటినే ప్రైవేటు చేతుల్లో పెట్టడం. మెడికల్ కాలేజీలు కొత్త వారు ఏర్పాటు చేస్తామంటే వారికి రాయితీలతో అవకాశం ఇవ్వండి. అంతే తప్ప మనం డబ్బులు పెట్టి, భూసేకరణ చేసి, భవనాలు కట్టి ప్రైవేటుకు లాభాలు ఇస్తారా ? ఇది మంచి విధానం అంటూ ఆస్థాన కరపత్రికలతో పొగడ్తలా ?
జగన్‌కి పేరు వస్తుందనే ఇదంతా..:
మొన్నే రెండు వారాల క్రితం అమరావతి కోసం రూ.7500 కోట్లు అప్పు చేశారు. నిన్న దాన్ని క్యాబినెట్‌లో ఆమోదించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నారు. కలల రాజధానిలో కి.మీ రోడ్డు వేసేందుకు రూ.180 కోట్లకు టెండర్ ఇచ్చారు. అలా మూడు కి.మీ రోడ్డు కోసం రూ.540 కోట్లకు టెండర్ ఇచ్చారు. రెండు, మూడు కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయిపోతుంది. కానీ మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంటున్నారు.
పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు దోచి పెడుతున్నారు:
అసలు మెడికల్ కాలేజీలకు కొత్తగా డబ్బు తీసుకు రావాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ హయాంలోనే నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. నాబార్డ్‌ను సంప్రదిస్తే మెడికల్ కాలేజీలకు నిధులు దొరుకుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరమే లేదు. కేవలం వైఎస్ జగన్‌కు పేరు వస్తుందనే దుగ్ద తప్ప ఇందులో మరొకటి లేదు. అందుకే వాటిని ప్రైవేటు వ్యక్తులకు, బినామీలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క మెడికల్ కాలేజీలో ఉద్యోగుల నెల జీతాలకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలా ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు అవుతుంది. 10 మెడికల్ కాలేజీలకు ఇలా ఇస్తే రూ.700 కోట్లు అవుతుంది. రెండేళ్లు ఇలా ఇస్తారా?. ఇది ఎంత వరకు సబబు?
ఇంకా 10 మెడికల్ కాలేజీలకు సుమారు 257 ఎకరాలు సేకరించాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల చొప్పున దోచి పెడుతున్నారు. కేంద్రం ఇచ్చిన పీజీ సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద ప్రైవేటుకు ఇచ్చేశారు. ఎన్నారై సీటు ఫీజు రూ.29 లక్షలని జీవో కూడా ఇచ్చారు. మేనేజ్ మెంట్ కోటా సీటు రూ.9 లక్షలని ఇచ్చారు.
రికార్డుస్థాయిలో అప్పు:
అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతోంది? డబ్బుల్లేవంటూనే 18 నెలల్లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రానికి భారీ అప్పులు తెచ్చుకుంటూ మరోవైపు జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారు.
కోటి సంతకాలు గవర్నర్‌కి సమర్పణ:
10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలపై ప్రజా ఉద్యమం చేపట్టిన వైయస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగించింది. దానికి అన్ని చోట్ల, అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఆ కోటి సంతకాల పత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకోగా, సోమవారం (డిసెంబరు 15వ తేదీ) అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అక్కణ్నుంచి అవి విజయవాడ చేరుకుంటాయి. ఆ పత్రాలను ఈనెల 18న గవర్నర్‌కి సమర్పిస్తాం. ఆ మేరకు ఆరోజు సా.4 గం.కు, మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్‌తో భేటీ కానున్నారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వివరించారు.


