కాషాయ దళం తదుపరి చీఫ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం
కష్టించి పనిచేసే కార్యకర్త అంటూ ప్రధాని మోదీ అభినందనలు
న్యూఢిల్లీ/లక్నో: అందరి అంచనాలను తలకిందుల చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం బిహార్ యువనేత నితిన్ నబీన్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. నబీన్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం నోటిఫికేషన్‌లో ప్రకటించారు. కాయస్థ వర్గానికి చెందిన 45 ఏళ్ల నితిన్ నబీన్ ప్రస్తుతం బిహార్ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో భవిష్యత్తులో ఈయన బీజేపీ చీఫ్ పదవిని చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. తద్వారా తక్కువ వయస్సులోనే బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టిస్తారని పార్టీ నేతలు అంటున్నారు.
మోదీ అభినందనలు..
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబీన్‌ను ప్రధాని మోదీ అభినందించారు. కష్టించి పనిచేసే కార్యకర్తగా గుర్తింపు పొందిన నబీన్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్న విశ్వాసం తనకుందన్నారు. ‘యువకుడు, కష్టించి పనిచేసే నేత, సంస్థాగత వ్యవహారంలో అనుభవమున్న వాడు, ఎమ్మెల్యేగా మంచి రికార్డు ఉంది. బిహార్‌కు పలుమార్లు మంత్రిగా పనిచేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు బాధ్యతలు నిర్వర్తించారు’అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
యూపీ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం లక్నోలో కేంద్రమంత్రి పియూష్ గోయెల్ ప్రకటించారు. ఈ పదవికి శనివారం పంకజ్ చౌదరి నామినేషన్ వేశారన్నారు. పోటీలో ఆయన ఒక్కరే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మొత్తం 1.62లక్షల బూత్‌ల ద్వారా ఈ ఎన్నిక జరిగిందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నుంచి పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారని గోయెల్ తెలిపారు. యూపీ బీజేపీ 17వ అధ్యక్షుడిగా ఎన్నికైన పంకజ్ చౌదరి కుర్మి వర్గానికి చెందిన వారు. ఈ వర్గం ఇతర వెనుకబడిన కులా(ఓబీసీ)ల జాబితాలో ఉంది. ఈ సందర్భంగా పియూష్ గోయెల్ పార్టీ జాతీయ కౌన్సిల్‌లోని 120 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. వీరిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి, సీఎం ఆదిత్య నాథ్ గోరఖ్‌పూర్ నుంచి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ లక్నో నుంచి ప్రాతినిథ్యం వహిస్తారు.
45 ఏళ్లకే 5 సార్లు ఎమ్మెల్యేగా..
బిహార్‌లో బీజేపీ సీనియర్ నేత, నాటి ఎమ్మెల్యే నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా 2006లో ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు నితిన్ నబీన్‌కు పార్టీ అధిష్టానం పటా్న(పశ్చిమ) నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి తొలిసారిగా బరిలోకి దింపింది. ఏకంగా 60వేల ఓట్ల భారీ మెజారిటీతో నబీన్ గెలిచారు. అప్పట్నుంచి వరసగా దాదాపు రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. తాజాగా బిహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 51,000 ఓట్ల మెజారిటీతో బంకింపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అలా కేవలం 45 ఏళ్ల వయసుకే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగా పలుమార్లు పనిచేశారు. ప్రస్తుతం నితీశ్ ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. నబీన్ గతంలో యువ మోర్చాలో పనిచేశారు. రాష్ట్ర ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. బీజేపీ చీఫ్‌గా నడ్డా స్థానంలో మరొకరిని నియమించాల్సిన సమయంలో నబీన్‌కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను అప్పగించడం గమనార్హం. నడ్డా తర్వాత బీజేపీ నూతన చీఫ్ అయ్యే అవకాశాలు నబీన్‌కు అత్యధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు స్వయంగా చెబుతున్నాయి.
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ నియమితులైనట్లు తెలియడంతో పటా్నలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్సవాలు మిన్నంటాయి. నితిన్ నబీన్‌కు శుభాకాంక్షల సందేశాలు వెల్లువలా వచ్చాయి. ఈ నియామకం పార్టీ కార్యకర్తలకు అంకితమిస్తున్నానని మీడియాతో నబీన్ పేర్కొన్నారు. తనపై విశ్వాసముంచి గురుతర బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధిష్టానం యువనాయకత్వం వైపు మొగ్గుచూపుతోందనడానికి నబీన్ నియామకం ఒక సంకేతమని వార్తలొచ్చాయి.
#BREAKING: Nitin Nabin Appointed As National Working President of BJP. pic.twitter.com/rdCbo9KpYq
— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 14, 2025


