సాక్షి శబరిమల: శబరిమలలో అరవణ ప్రసాద కొరత తీవ్రంగా ఉన్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. ప్రస్తుతాని అధిక సంఖ్యలో ప్రసాదాలు అందుబాటులో లేనట్లు స్పష్టం చేసింది. అంతేగాదు ప్రతి భక్తుడు 20 ప్రసాదం డబ్బాలకు మించి కొనుగోలు చేయానికి వీల్లేదని సమాచారం. దీనికి ప్రధాన కారణం గతేడాది(జనవరి 2024) అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు కలకలం రేగిన ఘటనే. ఆ సమయంలో లక్షలాది డబ్బాలను అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
అదీగాక ఇటీవలే సరిగ్గా అలాంటి లోపాలే అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో కూడా ఉన్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) విజిలెన్స్ విభాగం గుర్తించింది. అంతేకాదు.. అయ్యప్ప స్వామి ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను పకడ్బందీగా తనిఖీ చేయడానికి పంపాబేస్‌లో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’ ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆ నేపథ్యంలోనే ఈ అరవణ ప్రసాదం డబ్బాల కొరత ఏర్పడింది, అలాగే భక్తులకు కూడా పరిమితులు విధించారు ఆలయ అధికారులు.
ఇక శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బైజు కూడా ప్రస్తుతానికి కొత్త స్టాక్ వినియోగాన్ని నిలిపివేశామని, అయ్యప్ప అభిషేకాలకు, ప్రసాదాల తయారీకి ఇప్పటికే స్టోర్‌లో నిల్వ ఉన్న స్టాక్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.
(చదవండి: శబరిమలలో మరో అపచారం)


