తల్లి ఎప్పుడూ తన పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉండాలనుకుంటుంది. కానీ ఈ తల్లి తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జస్ట్ కార్పెంటర్ అయ్యి కుటుంబ పోషణ చూసుకుంటే చాలు అనుకుంది. అదే విషయం కొడుకుకి నూరుపోస్తూ ఉండేది. కానీ అతడు తన అమ్మ కూడా ఊహించని విధంగా సీఈవో అయ్యి ప్రభంజనం సృష్టించాడు. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా..గొప్ప టాలెంట్, శక్తి సామర్థ్యాలు ఉంటే..ఆకాశమంత కలను సాకారం చేసుకోవడం ఏమంత కష్టం కాదని చాటిచెప్పి స్ఫూర్తిగా నిలిచాడు.
అతడే మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్. 39 ఏళ్ల డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు అయిన సులేమాన్ బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో తన సక్సెస్ జర్నీ గురించి ఇలా షేర్ చేసుకున్నాడు. తన తండ్రి టాక్సీ డ్రైవర్ కాగా, తల్లి ఎన్‌ఎహెచ్‌ఎస్ నర్సుగా పనిచేసేదని చెప్పుకొచ్చాడు. శ్రామిక వర్గానికి చెందిన కుటుంబం కావడంతో తన తల్లి 16 ఏళ్లు వచ్చేటప్పటికీ కార్పెంటర్‌గానో లేదా ఎలక్ట్రిషియన్ ఉంటే చాలని పదేపదే చెబుతుండేదని అన్నాడు.
ఎందుకంటే 1980-90లలో తన కుటుంబం పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉందని వివరించాడు. సరిగ్గా 16 ఏళ్లప్పుడు తన తల్లిదండ్రులు విడిపోవడంతో తాను తన తమ్ముడు ఒంటరిగా పెరిగామని నాటి స్థితిని గురించి బాధగా చెప్పుకొచ్చారు. అయితే ఆ ఏజ్ ఉడుకు రక్తంతో ఉరకలేస్తూ ఉండే వయసు కావడంతో పెద్దగా భయపడలేదని, ఏదో సాధించేస్తాననే ధీమా ఎక్కువగా ఉండేదని తెలిపాడు. అయితే తన తల్లిదండ్రుల ఆలోచనకు విరుద్ధంగా చదువులో బాగా రాణించి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంల సీటు సంపాదించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచ్చిన నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు సులేమాన్.
అయితే అక్కడ చదువు పూర్తి చేయకుండా ప్రపంచాన్నే ఉద్ధరించేద్దామన్న ఉత్సాహంతో అమెరికా 9/11 వరల్డ్‌ట్రైడ్ సెంటర్ కూల్చివేతతో ముస్లిం యువతపై వచ్చిన వివక్షను రూపుమాపేందుకు కృషి చేసే పనికి పూనుకున్నట్లు వివరించారు. వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న ముస్లిం వ్యతిరేక భావాన నుంచి పుట్టికొచ్చిందే అతిపెద్ద కౌన్సెలింగ్ హెల్పలైన్ సేవ అని చెప్పుకొచ్చారు. బ్రిటన్ ఇది అతిపెద్ద కౌన్సిలింగ్ సర్వీస్‌లలో ఒకటని తెలిపారు. కుటుంబం తల్లిందండ్రులతో సంబంధాలు తెగిపోయి, బెదిరింపులకు లోనై ఇబ్బందిపడుతున్న యువ బ్రిటిష్ ముస్లింలకు ఆ సర్వీస్ వరంగా మారింది.
ఆ సామాజిక లక్ష్యమే చివరికి 2010లో డీప్‌మైండ్(మార్గదర్శక ఏఐ)ను స్థాపించడానికి దారితీసింది. ఆ తర్వాత గూగుల్ 650 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 5 వేల కోట్లకు పైనే) ఆ కంపెనీని కొనుగోలు చేసింది. ప్రస్తుతం సులేమాన్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏఐ టెక్నాలజీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఏఐని "హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్"గా అభివర్ణిస్తాడు.
తన శ్రామిక కుటుంబ నేపథ్యమే టెక్నాలజీవైపు ఆకర్షితుడిని చేసి..ఈ స్థాయికి చేర్చిందని అంటాడు. చివరగా జీవితంలో "మనంచేసే ఏ పనైన ది బెస్ట్‌గా చేయాలనుకుంటే కచ్చితంగా దిబెస్ట్ పొజిషన్‌లో ఉంటాం" అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తానని చెబుతున్నాడు సులేమాన్.
(చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..)


