దేశీ ఐటీ దిగ్గజం విప్రో తాజాగా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. ఎంటర్‌ప్రైజ్‌లకు ఏఐ సొల్యూషన్లు అందించేందుకు వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బెంగళూరులోని పార్ట్‌నర్ ల్యాబ్స్‌లో మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ కేంద్రం(హబ్)ను ఏర్పాటు చేయనుంది.
మూడేళ్లపాటు అమల్లోఉండే సహకారం ద్వారా ఎంటర్‌ప్రైజెస్‌కు కీలక కార్యకాలపాలలో ఏఐ అమలుకు వీలు కల్పించనుంది. ఒప్పందం ద్వారా విప్రోకున్న కన్సల్టింగ్, ఇంజినీరింగ్ ఆధారిత సామర్థ్యాలకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఐ స్టాక్‌ను జత కలుపుకోనుంది.
ఏఐ స్టాక్‌లో భాగంగా అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్, అజ్యూర్ ఏఐ ఫౌండ్రీ తదితరాలను భాగం చేసుకోనుంది. వెరసి ఎంటర్‌ప్రైజ్‌లకు కార్యకలాపాలలో టెక్నాలజీ వినియోగానికి వీలుగా విభిన్న ఏఐ సొల్యూషన్లు సమకూర్చనుంది.


