ఇదివరకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల గురించి విని ఉంటారు, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల గురించి తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ కథనంలో ప్రపంచంలోనే అత్యంత ధనికులైన రాజకీయ నాయకులు ఎవరు?, వాళ్ల నెట్‍వర్త్ ఎంత అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.
వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)
రష్యన్ అధ్యక్షుడు పుతిన్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడు. ఈయనకు ప్రధానంగా ఇంధన & సహజ వనరుల కంపెనీలలో ఎక్కువ వాటా వస్తుందని సమాచారం. దీంతో ఆయనను అత్యంత సంపన్నుడిగా గుర్తించారు. అయితే ఈయన నెట్‍వర్త్ ఎంత అనే విషయం అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. 200 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. సుదీర్ఘ రాజకీయ జీవితం ఈ అపారమైన సంపదకు కారణమైందని పలువురు చెబుతున్నారు.
అలెగ్జాండర్ లుకాషెంకో (Alexander Lukashenko)
పలు నివేదికల ప్రకారం.. సుమారు 9 బిలియన్ డాలర్ల సంపద కలిగిన అలెగ్జాండర్ లుకాషెంకో ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజకీయం నాయకుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 1994 నుంచి బెలారస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయనకు.. విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ , వ్యవసాయ, మాన్యుఫ్యాక్టరింగ్ సంస్థలలో వాటాలు ఉన్నాయని సమాచారం.
డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద.. ప్రధానంగా రియల్ ఎస్టేట్, బ్రాండింగ్, హోటల్స్ & గోల్ఫ్ రిసార్ట్‌ల నుండి వస్తుంది. ఈయన నెట్‍వర్త్ సుమారు 7.2 బిలియన్ డాలర్లు అని అంచనా. ఈయన రాజకీయ పదవిలో ఉన్న సమయం కంటే.. పెట్టుబడులు & మీడియా వెంచర్లలోనే సమయం గడిపారు. దీంతో ఆయన నెట్‍వర్త్ గణనీయంగా పెరుగుతూ ఉంది.
కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నెట్‍వర్త్ దాదాపు 5 బిలియన్ డాలర్లు అని అంచనా. కానీ ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు ఈయన సంపద 40 బిలియన్ డాలర్లని చెబుతున్నారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం, సైన్యం, వ్యాపారాలన్నీ కిమ్ కుటుంబం నియంత్రణలోనే ఉంటాయి. అంతే కాకుండా.. బంగారం, బొగ్గు, ఆయుధాలు, సిగరెట్లు, మద్యం ఎగుమతులు ద్వారా కూడా వీరికి ఆదాయం వస్తుంది.
జీ జిన్‌పింగ్ (Xi Jinping)
బ్లూమ్‌బెర్గ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంపద 1.5 బిలియన్ డాలర్లు. ఇందులో ఆయన కుటుంబ సంబంధిత ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. జిన్‌పింగ్ జీతం ఏడాదికి కేవలం 22,000 డాలర్లు మాత్రమే. ఇది కాకుండా ఈయనకు భూ ఖనిజాలు, టెక్ సంస్థలు, బంధువులతో ముడిపడి ఉన్న రియల్ ఎస్టేట్‌లో అనేక పెట్టుబడులు ఉన్నాయి.
ఇదీ చదవండి: డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు..


