జీ7 దేశాలను కాదని.. భారత్ సహా ఐదు దేశాలతో కోర్-5 దేశాల కూటమి ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు పాకిస్థాన్‌పై వరాల జల్లులను కంటిన్యూ చేస్తున్నారు. వాణిజ్యం, అప్పులు, ఇతరత్రా సహాయసహకారాలు అందించడంలో ఇప్పటికే పాకిస్థాన్‌కు అగ్రతాంబూలం ఇస్తున్న ట్రంప్ సర్కారు.. తాజాగా పాక్ యుద్ధ విమానాలు – ఎఫ్16 అప్‌గ్రేడేషన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏకంగా 686 మిలియన్ డాలర్లు.. అంటే.. సుమారు 5,800 కోట్ల రూపాయలను వెచ్చించనుంది.
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే..! ఆ తర్వాత పాక్ ప్రతిస్పందనకు ధీటుగా బదులిచ్చేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. అయితే.. భారత్‌తో పోలిస్తే.. పాకిస్థాన్ వద్ద అధునాతన యుద్ధ విమానాలున్నాయి. అమెరికా సరఫరా చేసిన ఎఫ్16, చైనా అందజేసిన జే10సీ వంటి యుద్ధ విమానాలు పాకిస్థాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. అయినా.. భారత్ తన సంప్రదాయ మిరాజ్, మిగ్ విమానాలతో పాకిస్థాన్ పీచమణిచింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఆసిమ్ మునీర్ ఆ సమయంలో బంకర్లలో తలదాచుకోవడంతో.. అధునాతన యుద్ధ విమానాలున్నా పాకిస్థాన్ ఏమీ చేయలేకపోయింది.
నిజానికి ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు చెందిన రాఫెల్‌ను కూల్చేశామని పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసింది. అదే సమయంలో పాకిస్థాన్‌కు చెందిన అమెరికా తయారీ ఎఫ్-16లు భారత్ దాడిలో ధ్వంసమైనట్లు నివేదికలు వచ్చాయి. ఇది ఒక విధంగా అమెరికాకు తీవ్ర అవమానం. దీంతో అగ్రరాజ్యం పాకిస్థాన్‌కు ఇచ్చిన యుద్ధ విమానాలను మరింత సమర్థంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ 5,800 కోట్ల రూపాయలతో పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్16 యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను అమెరికా పార్లమెంట్‌కు పంపింది.
డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ చేసిన ప్రతిపాదన ఇప్పుడు అమెరికా పార్లమెంట్ ముందు ఉంది. దీనిపై కాంగ్రెస్ ఆమోదం లేదా తిరస్కరణకు 30 రోజుల సమయం ఉంది. ఆ వెంటనే అమెరికా తన మిత్రదేశమైన పాక్‌కు లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్‌ను జారీ చేస్తుంది. ఆ వెంటనే పాకిస్థాన్‌లోని ఎఫ్16 యుద్ధ విమానాల అప్‌గ్రేడ్ ప్రక్రియ మొదలవుతుంది. 686 మిలియన్ డాలర్ల ప్రతిపాదనలో వేర్వేరు కేటగిరీల వారీగా ఆ ఏజెన్సీ వివరాలను కాంగ్రెస్‌కు అందజేసింది. దాని ప్రకారం 37 మిలియన్ డాలర్లను ఎఫ్16లో ఉపయోగించే కీలక పరికరాలకు వెచ్చిస్తారు. మిగతా 649 మిలియన్ డాలర్లను హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, లాజిస్టిక్స్‌కు కేటాయిస్తారు.
సరే.. పాకిస్థాన్‌కు అమెరికా చేసే ఈ సాయంతో భారత్‌కు నష్టమేంటి? అనుకుంటున్నారా? దీని ప్రభావం మనదేశంపై తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే.. ఎఫ్16లో అత్యంత కీలకమైన అప్‌గ్రేడేషన్స్‌పై అమెరికా దృష్టి సారించింది. ముఖ్యంగా 92 లింక్-16 టాక్టికల్ డేటా లింక్ సిస్టమ్‌ని పాకిస్థాన్‌కు అందజేయనుంది. ఈ సాంకేతికత అమెరికాతోపాటు.. నాటో దేశాల వద్ద మాత్రమే ఉంది. అంటే.. క్లిష్టపరిస్థితుల్లో అమెరికా, నాటో దేశాల మధ్య జామ్-ప్రూఫ్ కమ్యూనికేషన్‌కు ఉపయోగపడే ఈ టెక్నాలజీ ఇప్పుడు పాకిస్థాన్‌కు అందుతుంది. దీంతోపాటు.. కొత్త ఏవియానిక్స్, క్ట్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, మిషన్ ప్లానింగ్ సాఫ్ట్‌వేర్, విడిభాగాలను అమెరికా అందజేస్తుంది. ఇక ఎఫ్16పై పైలట్లకు సమర్థమైన ట్రైనింగ్ ఇచ్చేలా సిమ్యులేటర్లను అందజేయనుంది.
అయితే.. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నుంచి భారత్‌కు మరింత ముప్పు పెరిగే ప్రమాదాలున్నాయి. అయితే.. శత్రువు కదలికలను నిశితంగా పరిశీలించే భారత ప్రభుత్వం .. ముప్పును ఎదుర్కోవడంలో చాణక్య నీతిని ప్రదర్శిస్తుందని ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచదేశాలు గుర్తించాయి. ఇప్పుడు ఎఫ్16ల అప్‌గ్రేడేషన్ ముప్పును కూడా భారత్ సమర్థంగా ఎదుర్కొంటుందని ఆశిద్దాం..! ఈ వీడియో మీకు నచ్చినట్లైతే.. లైక్ చేయండి.. షేర్ చేయండి. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో షేర్ చేయండి.


