పాక్‌ వర్సిటీలో సంస్కృతం కోర్సు.. భగవద్గీత, మహాభారతం పాఠాలు! | Why Pak Versity introduced Sanskrit Course Gita Mahabharat Lessons | Sakshi
Sakshi News home page

పాక్‌ వర్సిటీలో సంస్కృతం కోర్సు.. భగవద్గీత, మహాభారతం పాఠాలు!

Dec 13 2025 8:04 AM | Updated on Dec 13 2025 8:04 AM

Why Pak Versity introduced  Sanskrit Course Gita Mahabharat Lessons

పాకిస్థాన్‌లోని ఓ యూనివర్సిటీ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారత్‌కు చెందిన ప్రాచీన భాష సంస్కృతాన్ని కోర్సుగా ప్రవేశపెట్టింది. అంతేకాదు.. మహాభారతం, భగవద్గీత పాఠాలు కూడా బోధించేందుకు సిద్ధమైంది. 

దేశ విభజన తర్వాత సంస్కృతం పాక్‌లో అడుగపెట్టింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (LUMS) ఈ భాషతో పార్ట్‌టైం కోర్సును ప్రారంభించింది. అంతకు ముందు.. మూడు నెలలుగా వారాంతపు వర్క్‌షాప్‌ కోర్స్‌గా ప్రవేశపెట్టగా.. అనూహ్య స్పందన లభించింది. 2027 నాటికల్లా పూర్తిస్తాయి కోర్సుగా మార్చేందుకు వర్సిటీ సిద్ధమవుతోంది.  

ఫార్మన్ క్రిస్టియన్ కాలేజ్‌లో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డా. షాహిద్ రషీద్ ఈ మార్పునకు ప్రధాన కారణం. గతంలో అరబిక్, పార్సీ భాషలపై పట్టు సాధించిన ఆయన.. ఏడాదిపాటు కష్టపడి సంస్కృతం నేర్చుకున్నారు. ఇందుకోసం కేంబ్రిడ్జ్ సంస్కృత పండితురాలు ఆంటోనియా రుపెల్, ఆస్ట్రేలియన్ ఇండాలజిస్ట్ మెక్‌కామస్ టేలర్ వద్ద ఆన్‌లైన్‌లో శిక్షణ పొందారు.

‘‘ప్రాచీన భాషల్లో మానవజాతికి చాలా జ్ఞానం ఉంది. సంస్కృతం ఈ ప్రాంతానికి చెందినది. పాణిని గ్రామం ఇక్కడే ఉంది. ఇది ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం. అందు కోసమైనా మేం కచ్చితంగా నేర్చుకోవాలి. సంస్కృతం ఏ ఒక్క మతానికి మాత్రమే చెందినది కాదు. భారతదేశంలోని హిందువులు, సిక్కులు అరబిక్ నేర్చుకుంటే.. పాకిస్తాన్‌లోని ముస్లింలు సంస్కృతం నేర్చుకుంటే.. భాషలనేవీ అడ్డంకులు కాకుండా వంతెనలుగా మారతాయి. ఇది దక్షిణాసియాకు కొత్త ఆశాజనక ఆరంభం అవుతుంది’’ అని రషీద్‌ అంటున్నారు.

సంస్కృత వ్యాకరణ పండితుడు పాణిని గంధార ప్రాంతంలో నివసించారు. ఆ గంధార ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్గా ఉంది.

విద్యార్థులు మొదట సంస్కృతాన్ని కఠినంగా, కష్టంగా భావించారు. కానీ కొద్దికాలానికే అర్థం చేసుకోగలిగారు. ఉర్దూ భాషపై సంస్కృతం ఎంత ప్రభావం చూపిందో వారికి కొత్తగా తెలిసింది. కొంతమంది విద్యార్థులు సంస్కృతం హిందీకి భిన్నమని కూడా తెలియదు అని ప్రొఫెసర్‌ రషీద్‌ చెబుతున్నారు. హిందీ మహాభారత్‌ టీవీ సిరీస్‌ థీమ్‌ సాంగ్‌ అయిన “హై కథ సంగ్రామ్ కి” (మహాభారత టీవీ సిరీస్ థీమ్) యొక్క ఉర్దూ అనువాదాన్ని కూడా నేర్చుకుంటున్నారట. 

గుర్మాని సెంటర్ డైరెక్టర్ డా. అలీ ఉస్మాన్ ఖాస్మీ చెబుతున్నది ఏంటంటే.. పంజాబ్ యూనివర్సిటీ లైబ్రరీలో సంస్కృతం పామ్-లీఫ్ మాన్యుస్క్రిప్ట్స్ పెద్ద కలెక్షన్ ఉంది. 1930లలో జేసీఆర్‌ వూల్నర్ వాటిని కేటలాగ్ చేశారు. కానీ 1947 తర్వాత పాకిస్తానీ అకాడెమిక్‌లు వాటిని ఉపయోగించలేదు. అయితే ఇప్పుడు స్థానిక పండితులను శిక్షణ ఇవ్వడం వల్ల పరిస్థితి మారుతుందని అన్నారు. లాహోర్ వర్సిటీ భవిష్యత్తులో మహాభారతం, భగవద్గీతపై కోర్సులు ప్రారంభించాలనుకుంటోంది. మరో 10–15 ఏళ్లలో పాకిస్తాన్‌లో భగవద్గీత, మహాభారతంపై అధ్యయనాలు చేసే రీసెర్చర్లు కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement