నిబంధనలు సడలించిన భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: భారత్‌ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా బిజినెస్ వీసాలు జారీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను సడలించింది. వీసా దరఖాస్తులను ఇకపై వేగంగా ఆమోదించబోతున్నారు. లద్దాఖ్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్–చైనా సంబంధాలు ఇటీవల మళ్లీ గాడిన పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షలు, టారిఫ్‌ల నేపథ్యంలో చైనాతో వాణిజ్య సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
ఇందులో భాగంగానే బిజినెస్ వీసా నిబంధనల్లో తాజాగా మార్పులు చేసింది. తక్కువ కాలంపాటు భారత్‌ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా వీసాలు ఇవ్వడం ద్వారా వారి సేవలు ఉపయోగించుకోవచ్చని, చైనాతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, వీసా దరఖాస్తుదారుల తనిఖీ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఆమోదంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. చైనా వృత్తి నిపుణులకు గతంలో ఎంప్లాయ్‌మెంట్ వీసాలు(ఈ వీసాలు) జారీ చేస్తుండేవారు.
వీటి కాలపరిమితి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ. బిజినెస్ వీసాలకు సంబంధించి మార్పు చేసిన నిబంధనలు అన్ని దేశాల దరఖాస్తుదారులకు వర్తిస్తాయి. అయితే, ఈ నిర్ణయం వల్ల చైనీయులు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఈ వీసాల జారీ ప్రక్రియను నాలుగు వారాల్లోపే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చైనా పరికరాలు, యంత్రాలతో ఉత్పత్తి కార్యకలాపాలు సాగించే భారతీయ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లాభం చేకూరనుంది. చైనా నిపుణులు బిజినెస్ వీసాలపై ఇండియాకు వచ్చి, సదరు కంపెనీలకు సహకరించే వీలుంది. చైనా పౌరులకు టూరిస్టు వీసాలను జారీ చేసే ప్రక్రియను ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే.
స్వాగతించిన చైనా విదేశాంగ శాఖ
చైనా నిపుణులకు బిజినెస్ వీసాలను సులువుగా, వేగంగా జారీ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ శుక్రవారం స్వాగతించారు. ఇదొక సానుకూలమైన ముందడుగుగా అభివరి్ణంచారు. ప్రయాణాలను సులభతరం చేస్తే ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు. భారత్, చైనా ప్రజల మధ్య అనుబంధం బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు.


