breaking news
business visas
-
చైనీయులకు సులువుగా బిజినెస్ వీసాలు
న్యూఢిల్లీ: భారత్‌ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా బిజినెస్ వీసాలు జారీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను సడలించింది. వీసా దరఖాస్తులను ఇకపై వేగంగా ఆమోదించబోతున్నారు. లద్దాఖ్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్–చైనా సంబంధాలు ఇటీవల మళ్లీ గాడిన పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షలు, టారిఫ్‌ల నేపథ్యంలో చైనాతో వాణిజ్య సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే బిజినెస్ వీసా నిబంధనల్లో తాజాగా మార్పులు చేసింది. తక్కువ కాలంపాటు భారత్‌ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా వీసాలు ఇవ్వడం ద్వారా వారి సేవలు ఉపయోగించుకోవచ్చని, చైనాతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, వీసా దరఖాస్తుదారుల తనిఖీ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఆమోదంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. చైనా వృత్తి నిపుణులకు గతంలో ఎంప్లాయ్మెంట్ వీసాలు(ఈ వీసాలు) జారీ చేస్తుండేవారు. వీటి కాలపరిమితి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ. బిజినెస్ వీసాలకు సంబంధించి మార్పు చేసిన నిబంధనలు అన్ని దేశాల దరఖాస్తుదారులకు వర్తిస్తాయి. అయితే, ఈ నిర్ణయం వల్ల చైనీయులు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఈ వీసాల జారీ ప్రక్రియను నాలుగు వారాల్లోపే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చైనా పరికరాలు, యంత్రాలతో ఉత్పత్తి కార్యకలాపాలు సాగించే భారతీయ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లాభం చేకూరనుంది. చైనా నిపుణులు బిజినెస్ వీసాలపై ఇండియాకు వచ్చి, సదరు కంపెనీలకు సహకరించే వీలుంది. చైనా పౌరులకు టూరిస్టు వీసాలను జారీ చేసే ప్రక్రియను ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వాగతించిన చైనా విదేశాంగ శాఖ చైనా నిపుణులకు బిజినెస్ వీసాలను సులువుగా, వేగంగా జారీ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ శుక్రవారం స్వాగతించారు. ఇదొక సానుకూలమైన ముందడుగుగా అభివరి్ణంచారు. ప్రయాణాలను సులభతరం చేస్తే ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు. భారత్, చైనా ప్రజల మధ్య అనుబంధం బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. -
హెచ్1బీ నైపుణ్య వృత్తులకు బీ1 వీసాలొద్దు!
వాషింగ్టన్: భారతీయ టెక్కీలపై ప్రతికూల ప్రభావం చూపే మరో నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకోనుంది. హెచ్1బీ నైపుణ్య వృత్తుల వారికి తాత్కాలిక బిజినెస్ వీసాలను జారీ చేయకూడదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదించింది. ఈ వీసా కింద కంపెనీలు ఆన్సైట్ జాబ్ విధానంలో పరిమిత కాలానికి టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు సాధించేందుకు పలు ఇతర విధానాలున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలపై పడే దుష్ప్రభావాన్ని ఈ ప్రతిపాదన తొలగిస్తుందని, హెచ్1బీ వీసా నియమాల అమలులో పారదర్శకత లభిస్తుందని స్పష్టం చేసింది. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. పలు భారతీయ టెక్నాలజీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. గతంలో, భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్‌పై బీ1 వీసాల జారీకి సంబంధించి ఆరోపణలు వచ్చిన విషయాన్ని విదేశాంగ శాఖ ప్రస్తావించింది. సుమారు 500 మంది ఉద్యోగులను వీసా నిబంధనలకు విరుద్ధంగా.. హెచ్1బీపై కాకుండా బీ1 వీసాలపై యూఎస్‌లో ఉద్యోగాలు కల్పించిందనే ఆరోపణలపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ ఇన్ఫోసిస్‌కు 8 లక్షల డాలర్ల జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేసింది. కాగా, తమ ఉద్యోగుల వేతన భారాన్ని భరించలేకపోతున్నామని, ఆ భారం నుంచి తమకు రక్షణ కల్పించాలని అమెరికాకు చెందిన ఒక ఆర్కిటెక్చర్ కంపెనీ కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆ కంపెనీ తమ వద్ద ఉన్న అమెరికన్ ఆర్కిటెక్ట్‌లను తొలగించి.. ఆ స్థానంలో చవకగా విదేశీ ఆర్కిటెక్చర్ సంస్థ నుంచి విదేశీ ఆర్కిటెక్ట్‌ల సేవలను పొందాలని భావిస్తుందేమో. కానీ, ఆ విదేశీ ఉద్యోగులకు కూడా హెచ్1బీ నిబంధనల ప్రకారం ఇక్కడి ఆర్కిటెక్ట్ సేవలకు ఇచ్చే వేతనాన్నే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, అమెరికన్ల ఉద్యోగాల రక్షణకు కాంగ్రెస్ రూపొందించిన ఇతర నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది’ అని వివరించింది. -
బ్రిటన్ ఎంపీ వీసా రద్దు
న్యూఢిల్లీ: బ్రిటన్ ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా లాయర్ అయిన లార్డ్ అలెగ్జాండర్ కార్లైల్ వీసాను భారతప్రభుత్వం రద్దు చేసింది. మీడియా సమావేశం ద్వారా భారత్–బంగ్లా సంబంధాల్లో సమస్యలను సృష్టించాలని చూస్తున్నారనే కారణాలతో గత రాత్రి బ్రిటన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కార్లైల్‌ను వెనక్కి పంపించింది. ‘కార్లైల్ మీడియా సమావేశంలో మాట్లాడటం వీసా నిబంధనలకు విరుద్ధం. రాజకీయ కార్యకలాపాలకు పాల్పడే వారికి ఏ దేశమూ వీసా ఇవ్వదు. ఆయనకు జారీ చేసిన బిజినెస్ వీసాతో మీడియా సమావేశం నిర్వహించరాదు. మూడో దేశానికి సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడేందుకు ఓ విదేశీయుడిని భారత్ ఎలా అనుమతిస్తుంది?’ అని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
చైనాకు షాక్ ఇచ్చిన పాకిస్థాన్!
వీసా నిబంధనలు మరింత కఠినతరం న్యూఢిల్లీ: అన్ని కాలాల్లోనూ తన మిత్రపక్షమని ఘనంగా చెప్పుకొనే చైనాకు పాకిస్థాన్ షాక్ ఇచ్చింది. చైనా జాతీయుల వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. పాకిస్థాన్‌లో పర్యటించాలనుకునే చైనా జాతీయుల కోసం కొత్త వీసా నిబంధనలను ఆ దేశ హోంశాఖ బుధవారం జారీ చేసింది. కల్లోలిత బెలూచిస్థాన్లో ఇద్దరు చైనీయులు అపహరణకు గురై హత్యకావడం ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు చైనీయులు బిజినెస్ వీసాలను దుర్వినియోగం చేసి తమ దేశంలో క్రైస్తవాన్ని ప్రచారం చేశారని పాక్ చెప్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఉద్యోగం, వ్యాపారం కోసం వచ్చే చైనీయులకు సంబంధించిన వీసా నిబంధనలను ఆ దేశం కఠినతరం చేసింది. ఈ నిబంధనల ప్రకారం పాక్ బిజినెస్ వీసాలు కావాలంటే.. చైనాలోని పాకిస్థాన్ ఎంబసీ గుర్తించిన సంస్థ నుంచి ఆహ్వానం పొందాల్సి ఉంటుంది. పాక్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనుమతితోపాటు పలువురు చైనా అధికారులు అనుమతి ఉంటేనే ఆ దేశవాసులకు బిజినెస్ వీసాలు ఇస్తామని పాక్ స్పష్టం చేసింది.


