రెండున్నరేళ్ల క్రితం ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలు పెట్టిన రష్యా ఇప్పుడు ఆర్థిక ఛట్రంలో పూర్తిగా మునిగిపోతోందా? అయితే.. ఆర్థిక మాంద్యం.. లేదంటే ద్రవ్యోల్బణం అన్నట్లుగా రష్యాలో పరిస్థితులున్నాయా? ఇప్పుడు రష్యా ముందున్న ఒకేఒక్క ఆశాదీపం భారతదేశమేనా? అందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల భారత్‌లో పర్యటించారా? ఈ ప్రశ్నలకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? యుద్ధం ప్రారంభమైన రెండేళ్ల వరకు జీడీపీలో ఎలాంటి తరుగుదల లేకుండా.. పైపైకి దూసుకుపోయిన రష్యాకు ఇప్పుడేమైంది?
అది 2022 ఫిబ్రవరి 24. రష్యా దళాలు బెలారస్ మీదుగా ఉక్రెయిన్‌పై దురాక్రమణను ప్రారంభించాయి. క్రమంగా ఉక్రెయిన్‌కు సముద్రమార్గంతో సంబంధాలు లేకుండా ఈ ఆక్రమణ కొనసాగింది. అంటే.. దక్షిణ ఉక్రెయిన్‌లో ఉండే ప్రధాన పోర్టులు ఒడెస్సా, మైకొలైవ్‌తోపాటు.. మారియుపూల్ వరకు రష్యా కబ్జా చేసేసింది.
అంతేకాదు.. నల్లసముద్రంతో సంబంధం లేకుండా.. అతిపెద్ద ప్రావిన్స్ అయిన జాపొరిజియా దక్షిణ భాగాన్ని ఆక్రమించి.. అక్కడి పౌరులకు రష్యా పౌరసత్వాన్ని ఇవ్వడం ప్రారంభించింది. తూర్పున డోనెట్స్క్, లుహాన్స్క్‌పై పట్టుసాధించింది. అంటే.. 2014లో ఆక్రమించిన క్రిమియా నుంచి రష్యాలోని బెల్గోల్ట్ వరకు రోడ్డు మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ పరిణామాలతో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు ఉక్రెయిన్ సముద్రంపై ఆధారపడకుండా చేసినట్లైంది.
2020లో కొవిడ్ కల్లోలం తర్వాత అమెరికా సహా.. దాదాపుగా అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. రష్యా సొంతంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను తయారు చేసినా.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనా.. కారిమకుల జీతాలను పెంచిన పుతిన్ సర్కారు ద్రవ్యోల్బణ ప్రమాదం నుంచి గట్టెక్కింది. 2022లో యుద్ధం ప్రారంభమయ్యాక.. సైన్యంలో నియామకాలు, ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ వంటి కిరాయి సేనల కోసం డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. ఒక సంవత్సరం వరకు పరిస్థితులను నియంత్రించుకుంటూ.. ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందనిపించినా.. 2023 నుంచి నియంత్రణ కోల్పోయింది. 2024లో ముదిరి పాకాన పడే పరిస్థితులు నెలకొన్నాయి.
యుద్ధం మూడున్నరేళ్లుగా నడుస్తుండడంతో.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం రష్యాకు తలకు మించిన భారమవుతోంది. చమురు ఎగుమతులపై ఆశలు పెట్టుకున్నా.. ధరలు పడిపోయాయి. అమెరికా ఆంక్షలతో పలు దేశాలు రష్యా చమురు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయి. దీంతో.. గత త్రైమాసికంలో జీడీపీ నేలముఖం చూడడం ప్రారంభించింది. 2023, 2024 సంవత్సరాల్లో 3-4% వృద్ధి నమోదైనా.. ఇప్పుడు మాత్రం పరిస్థితి చేయి దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు.. చివరకు వోడ్కాపైనా పన్నులను పెంచుతూ పరిస్థితిని నియంత్రించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి. ఈ పరిస్థితుల్లో రష్యా ముందు ఆశాదీపంగా కనిపిస్తున్న ఒకే ఒక్క దేశం భారత్..! అందుకే.. 2022 నుంచే రష్యా మన దేశానికి మరింత దగ్గరవ్వడం మొదలుపెట్టింది.
నిజానికి రష్యా-భారత్‌ల మైత్రి చారిత్రకమైనది. ఓల్గా నుంచి గంగా వరకు స్నేహం ఫరిడవిల్లిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. అయితే.. చమురు కోసం ఇరాక్, సౌదీలపై ఆధారపడే భారత్‌కు కూడా ఇప్పుడు తక్కువ ధరకే చమురును అందించే రష్యా ఓ ఆశాజ్యోతిగా మారింది. రష్యా అత్యధికంగా చమురు ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిపోయింది. యుద్ధం ప్రారంభానికి ముందు రష్యా నుంచి రోజుకు లక్ష బ్యారెళ్లలోపు చమురు మాత్రమే భారత్‌కు దిగుమతి అయ్యేది. ఇప్పుడు ఆ దిగుమతి ఏకంగా రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు పెరిగిపోయింది. అందుకే ట్రంప్ కూడా పదేపదే రష్యాను ఆర్థికంగా ఆదుకుంటున్నది భారతదేశమేనని వ్యాఖ్యానాలు చేస్తుంటారు. 38% రష్యా చమురు భారత్‌కే వెళ్తోందని, ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా భారత్ ఆజ్యం పోస్తోందంటూ కారాలుమిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే..!
ఇప్పుడున్న పరిస్థితుల్లో.. భారత్ ఏమాత్రం చమురు దిగుమతులను తగ్గించినా.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. రష్యా చమురును భారత్ కొనడం ఆపేయనుందని ట్రంప్ ఒకట్రెండు సార్లు ప్రకటనలు చేసిందే దరిమిలా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. భారత్‌కు కావాల్సిన రక్షణపరమైన అవసరాలను తీర్చేందుకు తాము సిద్ధమంటూ కీలక ఒప్పందాలు చేసుకున్నారు. చమురు కొనుగోళ్లను కొనసాగించేలా భారత్‌ను కోరారు. అవును.. ఇప్పుడు రష్యాకు పెద్దదిక్కు భారతే..! ఉక్రెయిన్‌లోని కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా భారత్ గనక రష్యా చమురు కొనుగోళ్లను కనీసం 20% తగ్గించినా.. రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందంటూ నివేదిక ఇచ్చింది.
ఓ వైపు భారత్‌ను నమ్ముకుంటూనే.. రష్యా తమ ప్రజలపై పన్నుల భారం వేస్తోంది. రష్యాలో అధిక డిమాండ్ ఉండే వోడ్కాపై అదనంగా 5% పన్ను విధిస్తోంది. ఇక వ్యాట్‌ను 10శాతం నుంచి 11శాతానికి పెంచింది. అదనంగా పెరిగిన ఒక శాతం వ్యాట్ విలువ ఒక ట్రిలియన్ రూబిల్స్‌గా ఉంటుంది. అంటే.. 1,304 బిలియన్ డాలర్లన్నమాట. అంతేకాదు. ఇంతకాలం రష్యాలో చిరువ్యాపారులపై వ్యాట్ లేదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే వంకతో.. వారిపైనా దశలవారీగా పన్ను విధించేందుకు సిద్ధమైంది. రష్యాలో రెపోరేటు బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ వడ్డీ రేట్లు 15శాతానికి పైగా ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షల కారణంగా విదేశాల నుంచి అప్పు పుట్టే అవకాశాలు లేకుండా పోయాయి. అమెరికా, ఐరోపాలో ఉండే రష్యా ఆస్తులు, రష్యన్ల బ్యాంకు ఖాతాలు స్తంభించిపోయాయి.
ఆర్థికపరంగా రష్యాకు ఇప్పుడు భారత్ అత్యంత కీలకమైన మిత్రదేశం. అదే సమయంలో భారత్‌కు కూడా రక్షణపరంగా రష్యా ఆప్తమిత్రుడు. పాకిస్థాన్ దాడులను భారత్ సమర్థంగా ఎదుర్కొనేందుకు దోహదపడ్డ ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు మనకు రష్యా నుంచి వచ్చినవే. మిగ్ విమానాలు కూడా రష్యా సరఫరానే. నిజానికి భారత్ తన రక్షణ వ్యవస్థల అవసరాలను ‘మేకిన్ ఇండియా’లో భాగంగా తీర్చుకోవాలని నిర్ణయించినప్పటికీ.. ఇప్పుడు రష్యా అధునాతన ఆయుధాలను విక్రయించేందుకు సిద్ధమవ్వడంతో.. దిగుమతుల వాటా 36శాతానికి పెరిగింది. నిజానికి దశాబ్దాలుగా భారత రక్షణ వ్యవస్థ బలోపేతానికి సహకరిస్తూ వచ్చిన ప్రధాన దేశం రష్యానే..! ఈ నేపథ్యంలో చమురు కొనుగోళ్ల ద్వారా మిత్రదేశం రష్యాను ఆదుకుంటూనే.. భారత్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశలో అడుగులు వేస్తోంది. భారత్ ఈ నిర్ణయం గనక తీసుకోకపోయి ఉంటే.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు..!


