పాకిస్తాన్‌లో విభజన అనగానే 1971 నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. మళ్లీ ఇప్పుడు దాయాది దేశంలో విభజన మాట బాగా వినబడుతోంది. అయితే ఈ విభజన వేరే రకమైనది. పాకిస్తాన్ జాతీయ సమాచార శాఖ మంత్రి అబ్దుల్ అలీమ్ ఖాన్ ఇటీవల చేసిన ప్రకటనతో విభజన చర్చ ఊపందుకుంది. దేశంలో చిన్న ప్రావిన్సుల ఏర్పాటు ఇప్పుడు ఖాయమని ఆయన చేసిన ప్రకటన పాక్‌లో సంచలనంగా మారింది. అయితే పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే చిన్న ప్రావిన్సులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారని జియో టీవీ నివేదించింది. అయితే ప్రావిన్సులను విభజించడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
పాకిస్తాన్‌లో ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రావిన్స్‌లను విడగొట్టి 12 చేయడానికి రంగం సిద్ధమైందని స్థానికి మీడియా సమాచారం. ఈ మేరకు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మధ్య తుది చర్చలు జరిగాయని.. కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. 1947 నాటికి పాకిస్తాన్‌లో ఐదు ప్రావిన్సులు ఉన్నాయి. అవి తూర్పు బెంగాల్, పశ్చిమ పంజాబ్, సింధ్, వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ (NWFP), బలూచిస్తాన్. 1971 విముక్తి యుద్ధం తర్వాత తూర్పు బెంగాల్ స్వాతంత్ర్యం ప్రకటించుకుని బంగ్లాదేశ్ ఏర్పడింది. పశ్చిమ పంజాబ్.. పంజాబ్ అయింది. వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ పేరును ఖైబర్ పఖ్తుంఖ్వాగా (Khyber Pakhtunkhwa) మార్చారు. సింధ్, బలూచిస్తాన్ పేర్లు అలాగే ఉన్నాయి.
ఎందుకీ విభజన?
పరిపాలనా సౌలభ్యం కోసమమే చిన్న ప్రావిన్సుల ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు పాకిస్తాన్ పాలకులు చెబుతున్నా అందుకు భిన్నమైన పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉద్రిక్తతలు పెరిగాయి. తమను స్వతంత్ర దేశాలుగా ప్రకటించాలని ఈ రెండు ప్రాంతాల ప్రజలు పోరాడుతున్నారు. మరోవైపు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ హైబ్రిడ్ పాలనపై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విభజన చర్చ తెరపైకి వచ్చింది. దీంతో పాకిస్తాన్‌లో సెమినార్లు, మీడియాలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి.
ఒక్కోదాన్ని మూడుగా విభజిస్తాం
షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఇస్తేకామ్-ఎ-పాకిస్తాన్ పార్టీ (IPP) నాయకుడు అబ్దుల్ అలీమ్ ఖాన్ ఒక సమావేశంలో ప్రసంగిస్తూ.. తమ దేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాలన్నింటిలోనూ అనేక చిన్న ప్రావిన్సులు ఉన్నాయని అన్నారు. సింధ్, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి అదనంగా మూడు ప్రావిన్సులు చొప్పున ఏర్పాటు అవుతాయని వెల్లడించారు. పరిపాలనా నియంత్రణను బలోపేతం చేయడానికి, పౌరులకు మెరుగైన సేవలను అందించడానికి ఇది సహాయపడుతుందని ఆయన చెప్పినట్టు జియో టీవీ తెలిపింది.
మేం ఒప్పుకోం
షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మాత్రం సింధ్ విభజనను వ్యతిరేకిస్తోంది. తమ ప్రావిన్స్‌ను విభజించడానికి లేదా మూడు ముక్కలు చేయడానికి తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని సింధ్ ముఖ్యమంత్రి, పీపీపీ నాయకుడు మురాద్ అలీ షా (Murad Ali Shah) గత నెలలో కుండబద్దలు కొట్టారు.
12కు పెరగనున్న ప్రావిన్సులు
దేశంలోని ఒక్కో ప్రావిన్స్‌ను మూడు భాగాలుగా చేయాలని పాకిస్తాన్ యోచిస్తున్నట్టు స్థానిక మీడియా సమాచారం. నాలుగు ప్రావిన్సులను విడగొట్టి 12కు పెంచేలా పాక్ సర్కారు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం.. పంజాబ్ ప్రావిన్స్ ఉత్తర పంజాబ్, మధ్య పంజాబ్, దక్షిణ పంజాబ్‌గా విభజించబడుతుంది. సింధ్ ప్రావిన్స్ కరాచీ సింధ్, మధ్య సింధ్, ఎగువ సింధ్‌లుగా విభజించబడుతుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా కూడా మూడు భాగాలవుతుంది. వీటిని ఉత్తర, దక్షిణ, గిరిజన ఖైబర్ పఖ్తుంఖ్వాగా పరిగణిస్తారు. అదేవిధంగా, బలూచిస్తాన్ (Balochistan) కూడా తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రావిన్సులుగా మారుతుంది.
కొత్త సమస్యలు ఖాయం
ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ప్రావిన్సులను విభజించడం వలన ప్రయోజనం ఉండదని మేధావులు, సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పాలనలోని అంతరాలను తొలగించకుండా ఏం చేసినా నిష్ఫలమన్నారు. బలహీనమైన సంస్థలు, అసమాన చట్ట అమలు, పేలవమైన స్థానిక పాలన అనేవి నిజమైన సమస్యలన.. వీటిని నివారించకుండా కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేయడం వల్ల అసమానతలు మరింత తీవ్రమవుతాయని వెటరన్ పోలీసు ఉన్నత అధికారి సయ్యద్ అక్తర్ అలీ షా అభిప్రాయపడ్డారు.
తిరుగుబాటు తప్పదు
పరిపాలనా పునర్నిర్మాణంతో గతంలో చేసిన ప్రయోగాలు సమస్యలను మరింత పెంచాయని పాకిస్తాన్‌కు చెందిన మేధావి సంఘం పిల్దాట్ అధ్యక్షుడు అహ్మద్ బిలాల్ మెహబూబ్ పేర్కొన్నారు. కొత్త ప్రావిన్సులను సృష్టించడం అనేది ఖరీదైన, సంక్లిష్టమైన, రాజకీయంగా మోసపూరితమైనదిగా డాన్ పత్రికలో రాసిన తన వ్యాసంలో వర్ణించారు. ఇప్పుడు చేయాల్సింది విభజన కాదని, రాజ్యాంగానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం.. బ్రిటిష్ తరహాలో విభజించు- పాలించు విధానాన్ని అనుసరిస్తున్నాయని మరికొందరు విమర్శించారు. ఇలాంటి చర్యలతో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు.
పాకిస్తాన్‌లో మరిన్ని ప్రావిన్సులను ఏర్పాటు చేయాలనే ప్రణాళికను ముందుకు తీసుకురావడం ఇది మొదటిసారి కాదు, బహుశా చివరిది కూడా కాకపోవచ్చు. కానీ గత ప్రతిపాదనలేవీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఈసారి ప్రతిపాదనకు ప్రధానమంత్రి షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఇస్తేకామ్-ఎ-పాకిస్తాన్ పార్టీ, సింధ్ ఆధారిత ముత్తహిదా క్వామి మూవ్‌మెంట్-పాకిస్తాన్ (MQM-P) పార్టీలతో పాటు పలువురు మేధావులు మద్దతుగా నిలవడం గమనార్హం.


