ప్రతి నిమిషానికి 2.. గంటకు 136.. రోజులో 3,260 మంది.. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల రూపంలో పోతున్న ప్రాణాల సంఖ్య ఇది. సేఫ్టీ ప్రచారాలు.. చర్యలు ఈ లెక్కను మరుసటి ఏడాదికి పెరగకుండా ఆపలేకపోతున్నాయి. ఇందునా భారతదేశం యాక్సిడెంట్‌లకు హాట్‌స్పాట్‌గా కొనసాగుతూ వస్తోంది. లక్షలాది ప్రమాదాలు, అపార ప్రాణనష్టం దేశానికి ఒక పెద్ద సవాలుగా మారాయి. అందునా.. శీతాకాలంలో ఈ రేటు మరింతగా ఉంటోంది. ఆ లోతుల్లోకి వెళ్తే..
భారతదేశం రోడ్డు భద్రతలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. 2025 జనవరి-జూన్ మధ్య యాక్సిడెంట్‌లో రూపంలో 29,000 మంది(కేవలం జాతీయ రహదారులపైన) బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 1.5–1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు (అన్నిరకాల యాక్సిడెంట్‌ల రూపంలో). ఇది ప్రపంచ మొత్తం మరణాల్లో 11%గా ఉంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా (2025) నివేదిక ప్రకారం.. రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఐదవ అత్యంత ప్రమాదకర దేశంగా ర్యాంక్ అయ్యింది. డ్రైవింగ్ పరిస్థితులు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు, అధిక వేగం ప్రమాదాలకు కారణంగా ఈ నివేదిక చూపించింది. డాటా ఫర్ ఇండియా అనే సంస్థ సర్వే ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు నమోదు చేసే దేశం.
కారణాలు ఇవిగో..👇
👉చాలా రహదారులు సరైన డిజైన్ ప్రమాణాలు లేకుండా నిర్మించబడ్డాయి. వాటిపై సంకేతాలు (sign boards), స్పీడ్ బ్రేకర్లు, డివైడర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైటింగ్ లేకపోవడం రాత్రి సమయంలో ప్రమాదాలకు దారితీస్తోంది.
👉ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం.. అధిక వేగం, తప్పు దిశలో డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ దాటడం వంటి ఉల్లంఘనలు కారణాలుగా ఉంటున్నాయి. మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగతున్నాయి. వీటికి తోడు..
👉టూవీలర్ హెల్మెట్, ఫోర్ వీలర్‌లో సీటు బెల్ట్ వాడకాలు కూడా మరణాల రేటుపై ప్రభావం చూపెడుతోంది. హిట్ అండ్ రన్, ఓవర్ స్పీడ్‌లు కూడా మరణాలకు కారణం అవుతున్నాయి.
డబ్యూహెచ్‌వో అంచనా ప్రకారం, హెల్మెట్ వాడితే తల గాయాలు 40% తగ్గుతాయి, సీటు బెల్ట్ వాడితే మరణాలు 50% తగ్గుతాయి.
👉ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ (Golden Hour) లో చికిత్స అందకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అంబులెన్స్ సేవలు, ట్రామా కేర్ సెంటర్లు సరైన స్థాయిలో ఉండడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు దూరంగా ఉండటం వల్ల సమయానికి చికిత్స అందక ప్రాణాలు పోతున్నాయి.
శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరగుతున్నాయి. గణాంకాల ప్రకారం.. చలికాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 30వేలకు తక్కువగా ఉండడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు.
పొగమంచు (Fog): దృశ్యమానం(విజిబిలిటీ) తగ్గిపోవడం వల్ల వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం సాధారణంగా మారింది.
తడి రహదారులు: మంచు, తేమ కారణంగా రహదారులు జారిపోవడం, బ్రేకులు సరిగా పనిచేయకపోవడం.
అధిక వేగం: డ్రైవర్లు వేగం తగ్గించకపోవడం, ఫాగ్ లైట్లు వాడకపోవడం.
అత్యవసర సేవల ఆలస్యం: ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సహాయం అందకపోవడం వల్ల మరణాలు పెరుగుతాయి.
యాక్సిడెంట్.. డెత్స్.. లెక్కలు:
2022లో: 4.5 లక్షల ప్రమాదాలు, 1.5 లక్షల అధికారిక మరణాలు
2023లో: 4.8 లక్షల ప్రమాదాలు, 1.72 లక్షల మరణాలు
2024లో.. 4.73 లక్షల యాక్సిడెంట్‌లు(కాస్త తగ్గినా) మరణాలు 1.77 లక్షలకు పెరిగాయి
2025 (జనవరి–జూన్): జాతీయ రహదారులపై 29,018 మరణాలు (పూర్తి గణాంకాలు రావాల్సి ఉంది)
భారతదేశంలో హైవేలు మొత్తం రహదారి నెట్‌వర్క్‌లో ఉండేది కేవలం 2% మాత్రమే. వీటికి ఫస్ట్ క్లాస్ హైవేల గుర్తింపు ఉంది. కానీ, దేశంలో జరిగే రోడ్డు ప్రమాద మరణాల్లో 50% కంటే ఎక్కువ వాటా వీటికే ఉంది. 2025లో ఇప్పటిదాకా సగటున రోజుకి హైవేల మీద 150 మరణాలు సంభవించాయి. అంటే.. ప్రతీ గంటకూ ఆరు మరణాలు అన్నమాట. ఈ లెక్కన హైవేలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
వెనుక నుంచి ఢీకొనడం (Rear-end collisions) రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా జరుగుతున్న విభాగం. ఇవి మొత్తం ప్రమాదాల్లో 21%కి కారణమవుతాయి. అలాగే మొత్తం మరణాల్లో 20% వీటి నుంచే ఉంటున్నాయి.
హిట్-అండ్-రన్ కేసులు రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు పెద్ద కారణం. ఇవి మొత్తం మరణాల్లో 18% వాటా కలిగి ఉన్నాయి.
లోయల్లో వాహనాల పడి జరిగే ప్రమాదాలు.. ఐదు శాతం కంటే తక్కువే ఉంటోంది. కానీ, వీటి ద్వారా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది.
మధ్యాహ్నా టైంలోనే అధిక యాక్సిడెంట్‌లు!
గణాంకాలను (MoRTH నివేదికలు) పరిశీలిస్తే.. ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్య ప్రమాదాలు 25–30% వరకు నమోదవుతాయి. - మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలో సుమారు 40% దాకా ఉంటోంది(అధిక రద్దీ కారణంగా..). ఇక.. సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి మధ్య ప్రమాదాల సంఖ్య 20–25% దాకా ఉంటోంది. అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల సమయంలోనే ప్రమాదాల సంఖ్య కనిష్టంగానే ఉంటోంది. కానీ, అర్ధరాత్రి దాటాక జరిగే యాక్సిడెంట్‌లలోనే మరణాల రేటు అధికంగా ఉంటోంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల సంభవించే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్(2024లో 24వేల మరణాలు.. ఈ ఏడాది కూడా అంతకు మించే..), తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ,రాజస్థాన్‌లో అత్యధిక మరణాల నమోదు అవుతున్నాయి. ఈ లెక్కన సగం రోడ్డు ప్రమాదాలు ఈ రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి.


