పురుషులతో సమానంగా బైక్ రైడింగ్‌లో మహిళలు దూసుకుపోతున్నారు. ఆకాశమే హద్దుగా రికార్డులు తిరగరాస్తున్నారు. అదే క్రమంలో పూణేకు చెందిన సోలో ఉమెన్ బైకర్ ఐశ్వర్య నాగర్కర్(32) అలియాస్ సఖి–రైడర్ని తన 350సిసి బైక్‌పై స్వర్ణ చతుర్భుజి హైవేపై ప్రయాణం (గోల్డెన్ క్వార్డిలేటరల్ హైవే జర్నీ) సాగిస్తున్నారు. యంగెస్ట్ ఇండియన్ మదర్ గా గతంలో ఏ మహిళా సోలో రైడర్ సాధించిన ఘనత కాకపోవడం గమనార్హం. ఈ ఘనత ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బూన్ ఆఫ్ రికార్డ్‌లలో నమోదు కానుంది.
గత 6వ తేదీన పూణెలో ప్రారంభమైన ఈ జర్నీ దాదాపుగా 6వేల కిమీ కొనసాగనుందని బెంగళూరు, చెన్నై, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం నగరాల మీదుగా సాగి తూర్పు ఉత్తర భారత ప్రాంతాల్లో పూర్తి సర్క్యూట్ పూర్తి చేసిన తర్వాత ఈ నెల 22న పూణేకు తిరిగి చేరుకుంటానని గృహిణి, 8ఏళ్ల కూతురుకి తల్లి కూడా అయిన ఐశ్వర్య చెప్పారు. బైక్ రైడ్ కొనసాగిస్తూనే ‘సాక్షి’తో ముచ్చటించిన ఆమె పలు అంశాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...

తెలుగువాళ్ల ఆదరణ మరువలేను..
నా బైక్ జర్నీ ప్రారంభమైన 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ఒంగోలుకు చేరుకున్నాను. అలాఅలా విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం పట్టణాల మీదుగా ప్రయాణించాను. ఈ సందర్భంగా పలు చోట్ల స్థానికులతో సంభాషించాను ప్రతీ చోటా అక్కడి సమస్యలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలపై వారితో ముచ్చటించాను. నన్ను స్వంత ఇంటి మనిషిలా ఆదరించిన వారి ఆత్మీయత మరచిపోలేను. నా జర్నీ సందర్భంగా ఇంకా చాలా మంది మహిళలు సంకోచాలతో తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారని అర్ధమైంది.

సేవతో మిళితం చేస్తూ...
నా బైక్ రైడింగ్ ఇతరుల కంటే వేగంగా ప్రయాణించడమో, రికార్డుల సృష్టికే పరిమితం కాదు... ఇతరులు నా కోసం నిర్దేశించిన పరిమితులను దాటి ప్రయాణించడం నా లక్ష్యం. దీనిని సేవతో మిళితం చేస్తూ సాగుతున్నా. మహారాష్ట్రలోని ఫోఫ్సండి జిల్లా పరిషత్ పాఠశాల సహా పలు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్ధుల కు అండగా ఉండేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. వారికి ఆర్ధిక చేయూత అందించేందుకు విరాళాలు సేకరించడానికి రైడర్లు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సహోద్యోగులను సమీకరిస్తుంటాను.

కూతురి కోసం మట్టి సేకరణ...
నా ఈ తాజా ప్రయాణంలో అద్భుతమైన వ్యక్తులను కలిశాను ప్రతి రాష్ట్రం ఎంత అందంగా ఉంటుందో గమనించాను అంతేకాదు నేను ప్రయాణించే ప్రతి రాష్ట్రం నుంచి గుప్పెడు మట్టిని సేకరిస్తానని నా కుమార్తెకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేశా. ఎందుకంటే మన దేశం సంస్కృతిలో... ఆహారంలో, భాషలో, సుసంపన్నమైనది. కానీ దేశపు నిజమైన ఆత్మ దాని మట్టిలోనే ఇమిడి ఉంటుందని నా అభిప్రాయం నేను ఆమెకు ఈ మట్టి జాడీలను ఇచ్చినప్పుడు, భారతదేశం మొత్తం ఆమె ఇల్లేనని... ఆకాశమే ఆమె హద్దు అనే నమ్మకాన్ని కూడా బహుమతిగా ఇస్తాను కేవలం మట్టి మాత్రమే కాదు, నేను ప్రయాణించే రహదారుల నుంచి ధైర్యం, నేను స్పృశించే భూమి నుంచి ఆశీర్వాదాలు, నేను కలిసే వ్యక్తుల నుంచి జ్ఞాపకాలను సేకరిస్తూ ముందుకు సాగుతున్నాను. నా ప్రయాణం కిలోమీటర్ల లెక్క గురించి కాదు, ఇది నా దేశంతో అనుసంధానం కావడం గురించి, అది పంచిన ప్రేమను ఇంటికి తీసుకురావడం గురించి.

మహిళకు స్ఫూర్తిగా..
నేను నా కోసం, నా కూతురి కోసం, తాను కూడా ఎవరూ ఊహించనంత దూరం ప్రయాణించగలనని నిరూపించే ప్రతి మహిళ కోసం ఈ రైడ్ చేస్తున్నాను. ఒక మహిళ బలం పరిమితుల ద్వారా నిర్వచించలేం, వాటిని ఛేదించే ధైర్యం ద్వారా మాత్రమే నిర్వచించవచ్చు. ఇది వారికి చూపించడమే నా లక్ష్యం. నేను సంచరించే ప్రతి రహదారి, మహిళలు స్వేచ్ఛగా, ధైర్యంగా భయం లేకుండా సంచరించే ప్రపంచం వైపు ఒక అడుగు. ఇతర మహిళలు వారి శక్తిని విశ్వసించడానికి, వారి కలలను సాకారం చేసుకోవడానికి వారి స్వంత మార్గాన్ని సృష్టించుకునేలా నా ప్రయాణాల ద్వారా, ప్రేరేపించాలనేది నా ఆలోచన.
నా మోటార్‌సైకిల్ కేవలం ఒక యంత్రం కాదు అది నా స్వరం, నా స్వేచ్ఛ, సాధికారత పట్ల నా నిబద్ధత. ప్రతి మైలుతో, మహిళలు తమ సొంత మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారిని ఎవరూ ఆపలేరనే సందేశాన్ని నాతో మోసుకెళ్తున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా, నా భర్త మద్దతు లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదు. నేను 15 రోజులు ఇంట్లో ఉండడం లేదంటే ఇలా రోడ్ల మీద ప్రయాణిస్తుంటే మా కూతురి బాగోగులు తాను చూసుకుంటున్నాడు. నా తల్లిదండ్రులు , నా అత్తమామలు కూడా తమ చేతనైనంతగా నాకు మద్దతు ఇస్తున్నారు. అదే విధంగా ప్రతీ మహిళ తనను తాను నిరూపించుకునేందుకు కుటుంబం అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాను.
::Satya Babu


