పవన్‌కళ్యాణ్‌పై కర్ణాటక మంత్రి సంతోష్ చురకలు
సాక్షి బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తీరుపై పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ధోరణిపై కన్నడ మంత్రి ఒకరు విరుచుకుపడ్డారు. రాజకీయాలంటే సినిమాలు కాదని, తెలుగు సినిమాలో మాత్రమే ఆయన హీరో అని, రాజకీయాల్లో కాదని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ ఎస్. లాడ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు పవన్‌కళ్యాణ్‌పై చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ‘ప్రజాసేవ అంటే సినిమా కాదు. జిమ్మిక్కులు, గిమ్మిక్కులు, నటనను ప్రజలు ఎప్పటికీ అభినందించరు.
అయినప్పటికీ బలవంతంగా రాజకీయాల్లో కూడా ఆయన నటిస్తున్నారు’.. అంటూ మంత్రి ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బెళగావిలో మంత్రి సంతోష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌కళ్యాణ్‌కు ఒక మనవి చేస్తున్నా. మీరు రాజకీయాలకు ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చారు. ఇన్ని రోజులు సినిమాల్లో నటిస్తూ వచ్చారు. సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. అయితే ఇది సినిమా కాదు.
సనాతన ధర్మం, హిందూ సంబంధిత విషయాల గురించి మాట్లాడితే ప్రజలకు ఏం ప్రయోజనం? పేదవారికి, శ్రామికుల కోసం, రాష్ట్రాభివృద్ధిపట్ల ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌డీఏ సర్కారులో భాగమైన మీరు విద్యా, ఉద్యోగాల విషయాలపై కేంద్రం వద్ద అధిక కేటాయింపులు సాధించి రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నించాలి. సనాతన ధర్మం గురించి ఎలాంటి ప్రసంగాలు ఇవ్వకండి’.. అంటూ ఆయన హితవు పలికారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో కనీస వేతనం ఎంత? ఈ విషయం పవన్‌కు తెలుసా? ఇప్పుడెందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు? బుద్ధ ధర్మం, ఇస్లాం ధర్మం గురించి ఎందుకు మాట్లాడరు’ అని ప్రశ్నించారు.


