’ గోల్డన్ సిల్క్ ఆఫ్ అస్సాం
చీర పాత బడిన కొద్దీ మెరుస్తుంది.
చీరల మన్నిక 150 సంవత్సరాలు దాటినా చెక్కుచెదరదు.
ఒక్కో చీర ధర రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది.
అత్యంత ఖరీదైన చీరల తయారీ కేంద్రంగా సువాల్‌కుచి.
ముగా చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి
పట్టు చీరలంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి కంచి, ఇక్కత్, గద్వాల్, బనారస్, ధర్మవరం, ఉప్పాడ... బనారస్ మినహాయిస్తే మిగిలినవన్నీ తెలుగు రాష్ట్రాలు, సమీప ప్రాంతాల్లో తయారయ్యేవే. దేశీయ మార్కెట్లో వీటి పరపతి అంతా ఇంతా కాదు. అయితే ఇంతకు మించి పరపతి సాధించిన మరో రకమే ముగా సిల్క్. ‘గోల్డన్ సిల్క్ ఆఫ్ అస్సాం’గా పేరుగాంచిన ముగా పట్టు చీరలు అస్సాం రాష్ట్రంలోని సువాల్‌కుచి కేంద్రంగా తయారవుతున్నాయి.
అస్సాంలో తయారై అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ముగా చీరలు దేశంలో తయారయ్యే అత్యంత ఖరీదైన చీరల్లో ముందు వరుసలో ఉన్నాయి. జీఐ ట్యాగింగ్‌తో నాణ్యత గుర్తింపు ఉన్న ఈ చీరలకు జపాన్ , జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల మార్కెట్‌లో బోలెడంత క్రేజ్.
మనకు తెలిసిన కంచి, బనారస్ పట్టు చీరల్లో మేలిమిరకం చీరలు రూ.25 వేల నుంచి లభ్యమైతే ముగా పట్టు చీరలు మాత్రం కనిష్టంగా రూ.50 వేలు ఉంటే... డిజైన్ బట్టి చీర ధర రూ.5 లక్షల వరకు ఉంది. ఈ చీరల మన్నిక కూడా వందేళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. ఈ చీరలకు దేశీయంగా మార్కెట్ ఉన్నప్పటికీ... వీటి ధర మాత్రం సంపన్న వర్గాలు మాత్రమే కొనుగోలు చేసే విధంగా ఉంది. అయితే ఈ చీరలకు జపాన్ , యూరప్ మార్కెట్‌లో మాత్రం మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా అతినీలలోహిత కిరణాలకు రక్షగా ఈ పట్టు చీర ఉంటుందనే నమ్మకం అక్కడి మార్కెట్‌ను భారీగా పెంచింది. అంత ఖరీదైన చీరలు తయారు చేస్తున్నా కార్మికులకు మాత్రం అరకొర ఆదాయమే!
సువాల్‌కుచిలో వేలాది మగ్గాలు...
అస్సాం రాష్ట్రంలోని పాలస్‌బరి, బొకాఖత్, బర్పేట, నల్బరీ, ధుబ్రి జిల్లాల్లోనూ ఈ చీరల తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో మగ్గాలు, డిజిటల్ మగ్గాలు మాత్రం సువాల్‌కుచిలో మాత్రమే చూస్తాం. ఇక్కడ పట్టు పురుగుల నుంచి దారం తీయడం, ఆ దారాన్ని ప్రాసెస్ చేసి చీర తయారీకి అనువైన విధంగా మార్చేవరకు అవసరమైన ప్రక్రియంతా ఇక్కడ జరుగుతుంది. ముగా పట్టు పురుగు కకూన్ (గూడు/కవచం) నుంచి పట్టు దారాన్ని తీస్తారు.
ఒక కిలో పట్టు గూళ్ల ధర ప్రస్తుత మార్కెట్‌లో రూ.45 వేలుగా ఉంది. ఇందులో దాదాపు 5వేల గూళ్లు ఉంటాయి. వీటిని ప్రాసెస్ చేస్తే ఒకటిన్నర చీరలకు సరిపడా దారం తయారవుతుంది. ఒక్కో చీర తయారైన తర్వాత సగటున 700 గ్రాములుంటుంది. డిజైన్ , జరీ వినియోగాన్ని బట్టి చీర బరువు మారుతుంది. ఒక చీర తయారీకి గాను దారం ప్రాసెస్ నుంచి చివరి వరకు సగటున నెల రోజుల నుంచి 3 నెలల సమయం పడుతుందని, డిజైన్ ను బట్టి తయారీకి మరింత సమయం కూడా పడుతుందని నేత కార్మికులు చెబుతున్నారు.
యూవీ రక్షణకు ప్రత్యేకం
ముగా చీరలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశీలతో పాటు జపాన్ లోనూ ఈ పట్టు చీరలు, వస్త్రాలకు డిమాండ్ ఉంది. దీంతో అస్సాంలో ఉత్పత్తి అయ్యే ముగా వస్త్రాల్లో 80 శాతం పైగా ఎగుమతి చేస్తామని సువాల్‌కుచి వ్యాపారి హీరాలాల్ వివరించారు. ముగా పట్టు అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షణ స్తుందని, వీటిని గొడుగులుగా కూడా తయారు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వాటితోపాటు ఆభరణాలు కూడా తయారు చేస్తున్నామన్నారు.
రసాయనాలు లేవు..
→ అత్యంత ఖరీదైన చీర... మార్కెట్‌లో ఈ రకానికి బ్రాండింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. నార్త్ ఈస్ట్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఈహెచ్‌హెచ్‌డీసీ)ఆధ్వర్యంలో ఈ చీరలకు జీఐ (జీయోగ్రాఫికల్ ఇండికేషన్ ) ట్యాంగింగ్ చేస్తున్నారు. జీఐ ట్యాగ్ ఉన్న చీరలు మాత్రమే మన్నికైనవనే సంకేతాన్ని మార్కెట్‌లోకి తీసుకెళ్తున్నారు.
→ జీఐ ట్యాగింగ్ కోసం సువాల్‌కుచిలోని ఎన్ ఈహెచ్‌హెచ్‌డీసీలో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మూడు రకాల పరీక్షలు చేసి చీర వాస్తవికతను నిర్ధారిస్తారు. ఒక్కో చీర పరిశీలించి జీయో ట్యాగ్ వేసినందుకు అక్కడ రూ.100 ఫీజు వసూలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ ల్యాబ్‌లో దాదాపు 30 లక్షల పరీక్షలు జరిపినట్లు ఎన్ ఈహెచ్‌హెచ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ మారా కోచో తెలిపారు.
→ దేశంలోనే అత్యంత విలువైన చీరల తయారీలో కీలక ప్రాత పోషిస్తున్న నేత కార్మికులు, కూలీలు మాత్రం ఆర్థికంగా బక్కచిక్కి ఉన్నారు. వీరికి రోజుకు సగటున రూ.400 మేర కూలి చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఈ చీరలకు విదేశాల్లో మార్కెట్ ఉండడంతో నేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తున్న చీరలను వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. దీంతో వ్యాపారులు మాత్రమే అధిక లాభాలను గడిస్తున్నారు.
→ ముగా దారం సహజంగా బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. సూర్యకాంతి పడినప్పుడు ఈ మెరుపు మరింత ప్రకాశవంతమవుతుంది. దారం వయసుతో పాటు మెరుపు పెరుగుతుంది. ఇతర పట్టు రకాలు కాలక్రమంలో మసకబారితే, ముగా పట్టు మాత్రం కడిగిన కొద్దీ, ధరించిన కొద్దీ బంగారంలా మరింత మెరుస్తుంది. ప్రపంచంలోని అన్ని సహజ పట్టు రకాల్లో ముగా పట్టు ఎక్కువ బలమైందిగా పేరొందింది.
→ సోము–సోలు చెట్లు తగ్గిపోవడం వల్ల ముగా పట్టు పురుగుల సంఖ్య తగ్గుతోంది. ఈ పురుగులు అత్యంత సున్నితమైనవి కావడంతో వాతావరణంలో మార్పులు జరిగినా, కనీసం పురుగుమందులూ, ఇతర పొగ వాసన తగిలిన వెంటనే ఈ ముగా పట్టు పురుగులు వెంటనే చనిపోతాయి. ప్రస్తుతం ముగా పట్టు పరిశ్రమకు ఇదే అతిపెద్ద సవాలు. మరోవైపు ముగా చీరలు మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. పాలిస్టర్, టస్సర్ మిక్స్ వెరైటీలు మరో సవాలు.
→ ముగా పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అస్సాం ప్రభుత్వం ‘ముగా మిషన్’ పథకం అమలు చేస్తోంది. సోము చెట్ల పెంపకం, సీడ్ బ్యాంకులు, నేతకారులకు శిక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సువాల్‌కుచిలో ‘ముగా సిల్క్ విలేజ్’ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం లాంటి కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి.
సువాల్‌కుచి నుంచి – చిలుకూరి అయ్యప్ప, సాక్షి


