రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ఎడిషన్‌లో అద్భుతం జరిగింది. అస్సాం, సర్వీసస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ (Assam vs Services) కేవలం 90 ఓవర్లలోనే ముగిసింది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) పూర్తైన మ్యాచ్ ఇదే.
గతంలో ఈ రికార్డు 1961-62 ఎడిషన్‌లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్ 547 బంతుల్లో ముగియగా.. అస్సాం-సర్వీసస్ మ్యాచ్ కేవలం 540 బంతుల్లోనే పూర్తైంది.
అస్సామ్‌లోని టిన్సుకియా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్‌లో నిన్న (అక్టోబర్ 25) మొదలైన ఈ మ్యాచ్ కేవలం నాలుగు సెషన్లలోనే (రెండో రోజు తొలి సెషన్) ముగిసింది. ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అస్సాంపై సర్వీసస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లు (103 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 29.3 ఓవర్లు (75 ఆలౌట్) ఆడగా.. సర్వీసస్ తొలి ఇన్నింగ్స్‌లో 29.2 ఓవర్లు (108 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లు (73/2) ఆడింది.
మ్యాచ్ మొత్తంలో ఇరు జట్లు కలిపి 359 పరుగులు చేశాయి. 32 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు రియాన్ పరాగ్ (Riyan Parag) (అస్సాం) బంతితో అద్భుత ప్రదర్శనలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు.
చరిత్రాత్మక హ్యాట్రిక్స్
ఈ మ్యాచ్‌లో మరో అద్భుతం కూడా చోటు చేసుకుంది. సర్వీసస్ బౌలర్లు అర్జున్ శర్మ (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్), మోహిత్ జాంగ్రా (లెఫ్ట్ ఆర్మ్ సీమర్) ఒకే ఇన్నింగ్స్‌లో (అస్సాం తొలి ఇన్నింగ్స్) హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో డబుల్ హ్యాట్రిక్‌లు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఇన్నింగ్స్ విశ్లేషణ:
- అస్సాం తొలి ఇన్నింగ్స్: 103 పరుగులు (17.2 ఓవర్లు)
టాప్ స్కోరర్: ప్రద్యున్ సైకియా – 52
- సర్వీసస్ తొలి ఇన్నింగ్స్: 108 పరుగులు (29.2 ఓవర్లు)
అస్సాం బౌలర్ రియాన్ పరాగ్: కెరీర్ బెస్ట్ 5/25
- అస్సాం రెండో ఇన్నింగ్స్: 75 పరుగులు (29.3 ఓవర్లు)
అర్జున్ శర్మ: 4/20
అమిత్ శుక్లా: 6 ఓవర్లు – 3 వికెట్లు – కేవలం 6 పరుగులు
- సర్వీసస్ లక్ష్యం- 71 పరుగులు
13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది
చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!


