మహిళల వన్డే ప్రపంచకప్‌లో (women's Cricket World Cup) ఆస్ట్రేలియా (Australia Women's Cricket Team) ప్రస్తానం అద్వితీయంగా సాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు పూర్తైన 12 ఎడిషన్లలో ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. తద్వారా టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు కలిగి ఉంది.
ఘన చరిత్ర కలిగిన ఆసీస్.. ప్రస్తుతం ఎనిమిదో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2025 ఎడిషన్‌లో ఓటమెరుగని ఏకైక జట్టుగా సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో భారత్‌తో అమీతుమీకి సిద్దమైంది.
ఈ మ్యాచ్ నవీ ముంబై వేదికగా అక్టోబర్ 30న జరుగనుంది. తొలి సెమీస్‌లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. ఆసీస్ మరోసారి సెమీస్‌కు చేరిన నేపథ్యంలో ప్రపంచకప్‌లో ఆ జట్టు ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.
తొట్ట తొలి ఛాంపియన్ ఇంగ్లండ్
ఈ మెగా టోర్నీ 1973లో (ఇంగ్లండ్‌లో) తొలిసారి జరిగింది. ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి తొట్ట తొలి జగజ్జేతగా ఆవిర్భవించింది. 7 జట్లు పాల్గొన్న ఆ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
తొలిసారి జగజ్జేత
భారత్ వేదికగా జరిగిన రెండో ఎడిషన్‌లో (1978) ఆస్ట్రేలియా తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఎడిషన్‌లో ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. కేవలం నాలుగు జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆతిథ్య భారత్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. భారత్‌కు ఇదే తొలి ప్రపంచకప్.
రెండోసారి
న్యూజిలాండ్ వేదికగా జరిగిన మూడో ఎడిషన్‌లో (1982) ఆస్ట్రేలియా రెండో సారి ఛాంపియన్‌గా నిలిచింది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లోనే జరిగిన ఈ ఎడిషన్‌లో ఆసీస్ అజేయగా జట్టుగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్‌లోనూ ఇంగ్లండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
హ్యాట్రిక్
స్వదేశంలో జరిగిన 1988లో ఎడిషన్‌లో ఆసీస్ మరోసారి ఛాంపియన్‌గా నిలిచి, హ్యాట్రిక్ సాధించింది. ఐదు జట్లుతో 60 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఈ ఎడిషన్‌లోనూ ఇంగ్లండ్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో ఆసీస్ ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి, ముచ్చటగా మూడో టైటిల్ ఎగరేసుకుపోయింది.
తొలిసారి పరాభవం
1993 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తొలిసారి ఫైనల్‌కు చేరలేకపోయింది. రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా, న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలువగా.. ఆస్ట్రేలియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ ఎడిషన్‌లో 8 జట్లు పాల్గొనగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
తిరిగి జగజ్జేతగా..
1997లో భారత్ వేదికగా జరిగిన ఎడిషన్లో ఆస్ట్రేలియా తిరిగి జగజ్జేతగా ఆవిర్భవించింది. 11 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలువగా.. భారత్ సెమీస్ వరకు చేరుకుంది.
మూడు సార్లు పరాభవం తర్వాత..!
మూడు సార్లు ఫైనల్లో పరాభవం తర్వాత న్యూజిలాండ్ తొలిసారి 2000 ఎడిషన్‌లో ఛాంపియన్‌గా అవతరించింది. స్వదేశంలో జరిగిన ఈ ఎడిషన్‌లో న్యూజిలాండ్ తిరుగులేని ఆధిపత్యం చలాయించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 8 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
భారత్‌పై గెలిచి ఐదోసారి
సౌతాఫ్రికా వేదికగా జరిగిన 2005 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఐదోసారి జగజ్జేతగా ఆవతరించింది. ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది.
ఊహించని పరాభవం
స్వదేశంలో జరిగిన 2009 ఎడిషన్‌లో ఆసీస్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు సూపర్ సిక్స్ దశను అధిగమించలేకపోయింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకోగా.. ఇంగ్లండ్ తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఆరో టైటిల్
భారత్ వేదికగా జరిగిన 2013 ఎడిషన్లో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకొని ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో వెస్టిండీస్‌పై విజయం సాధించి ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ ఎడిషన్లో భారత్ సూపర్ సిక్స్‌కు కూడా చేరలేకపోయింది.
ఇంగ్లండ్ నాలుగోసారి..
స్వదేశంలో జరిగిన 2017 ఎడిషన్‌లో ఇంగ్లండ్ విజేతగా అవతరించింది. ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి, నాలుగసారి జగజ్జేతగా నిలిచింది.
ఏడోసారి జగజ్జేతగా..
న్యూజిలాండ్ వేదికగా జరిగిన 2022 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఏడో సారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్లో భారత్ నాకౌట్ దశకు చేరలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆసీస్ ఎనిమిదో టైటిల్‌పై కన్నేసింది.


