ఐసీసీ తాజాగా (డిసెంబర్ 10) విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్, ఇంగ్లండ్ ప్లేయర్ల హవా కొనసాగింది. తాజాగా ఇరు జట్ల మధ్య యాషెస్ రెండో టెస్ట్ (పింక్ బాల్) జరగడమే ఇందుకు కారణం. ఆ టెస్ట్‌లో 8 వికెట్లతో చెలరేగిన ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ ఏకంగా మూడు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. అదే మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఇరగదీసిన ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అగ్రపీఠాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.
ఇదే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఓ మోస్తరు ప్రదర్శనలు చేసిన ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకగా.. ఆసీస్ వికెట్‌కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ ఓ స్థానం మెరుగుపర్చుకొని 17వ స్థానానికి చేరాడు. టాప్-10లో ఉండిన ఆసీస్, ఇంగ్లండ్ బ్యాటర్లలో ట్రవిస్ హెడ్, హ్యారీ బ్రూక్ తలో రెండు స్థానాలు కోల్పోయి 4, 7 స్థానాలకు పడిపోయారు.
తాజాగా విండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన కేన్ విలియమ్సన్ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లెక్కన చూస్తే.. టెస్ట్‌ల్లో ఫాబ్-4గా పిలువబడే వారిలో విరాట్ కోహ్లి మినహా మిగతా ముగ్గురు టాప్-3లో (రూట్, కేన్, స్టీవ్) ఉన్నారు. విరాట్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ర్యాంకింగ్స్‌లో అతని పేరే లేదు.
ఈ వారం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందిన వారిలో రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, జాక్ క్రాలే, షాయ్ హోప్, జస్టిన్ గ్రీవ్స్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. విండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రచిన్, లాథమ్ భారీ సెంచరీలతో కదంతొక్కి 15, 34 స్థానాలకు ఎగబాకగా.. ఆదే మ్యాచ్‌లో సెంచరీ, డబుల్ సెంచరీతో చెలరేగిన హోప్, గ్రీవ్స్ 48, 60 స్థానాలకు ఎగబాకారు.
ఇంగ్లండ్‌తో రెండో యాషెస్ టెస్ట్‌లో బ్యాట్‌తోనూ రాణించిన మిచెల్ స్టార్క్ 12 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకగా.. అదే మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన జాక్ క్రాలే 6 స్థానాలు మెరుగుపర్చుకొని 45వ స్థానానికి ఎగబాకాడు.
బౌలింగ్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో స్టార్క్‌తో (3 స్థానాలు ఎగబాకి) పాటు కీమర్ రోచ్ (5 స్థానాలు ఎగబాకి), బ్రైడన్ కార్స్ (4 స్థానాలు ఎగబాకి), జకరీ ఫౌల్క్స్ (9 స్థానాలు ఎగబాకి) లబ్ది పొందారు. అత్యుత్తంగా న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ 76 స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరాడు. టాప్-2 బౌలర్లుగా బుమ్రా, మ్యాట్ హెన్రీ కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్, జడేజా, కుల్దీప్ వరుసగా 12 నుంచి 14 స్థానాల్లో ఉన్నారు.
ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, జన్సెన్, స్టోక్స్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. మరో ఇద్దరు భారత ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్య తలో స్థానం మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు.


