జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ పోటీలు గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో సందడిగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో సాక్షి టీమ్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తొలి రోజు బిగ్ టీవీతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతో విజయదుందుబి మోగించారు.
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బిగ్ టీవీ టీమ్.. 20 ఓవర్లలో 115 పరుగులు చేయగా సాక్షి టీమ్ కేవలం 12.5 ఓవర్లలో రెండే వికెట్లో కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
సాక్షి టీమ్‌కు చెందిన సతీష్ 48 పరుగులు చేయగా.. రమేష్ 47 పరుగులు చేసి సత్తా చాటారు. ఈ విజయంతో సాక్షి సెమీస్‌లోకి అడుగు పెట్టింది.

బుధవారం జరిగిన సెమీస్‌లో సాక్షి టీమ్ మరోసారి సత్తా చాటింది. వీ6తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే విజయం సాధించి విజయపరంపరను కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వీ6ను సాక్షి 104 పరుగులకు కట్టడి చేసింది. సాక్షి బౌలర్లలో రామకృష్ణ, అనిల్, రమేష్‌లు అద్భుతంగా బౌలింగ్ చేసి తలో 2 వికెట్లు తీశారు.
అనంతరం చేధనకు దిగిన సాక్షి టీమ్ కేవలం 12.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. రమేష్ 83 పరుగులు చేసి ఒంటిచేత్తో సాక్షిని గెలిపించాడు. బౌలింగ్‌లోనూ 2 వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ గెలుపుతో సాక్షి టీమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగే ఫైనల్లో సాక్షి టీమ్ టీవీ9తో అమీతుమీ తేల్చుకుంటుంది.


